విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా మారుతున్న వేళ.. వారి భరతం పట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా లైంగిక వేధింపులకు పాల్పడే టీచర్లను ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు వారి విద్యార్హత కూడా రద్దు చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. ఆ మేరకు చర్యలకు ఉపక్రమించింది. గత పదేళ్లలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న టీచర్ల వివరాలు సేకరిస్తోంది. తమిళనాడు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వెలుగులోకి వస్తున్నాయి.ముఖ్యంగా కృష్ణగిరి జిల్లా లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు కలిసి 13 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో ఆ ఉపాధ్యాయులను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి జైలుకు తరలించగా, పాఠశాల విద్యాశాఖ ఆ ముగ్గరుని డిస్మిస్ చేసింది. అదే విధంగా తిరుచ్చి, ఈరోడ్, హోసూరు, శివగంగ సహా పలు ప్రాంతాల్లో విద్యార్థినులు లైంగిక వేధింపులకు గురవుతున్నారనే వార్తలు ఇటీవల వెలుగుచూడడంతో ఈ విషయం తీవ్రరూపం దాల్చింది. విద్యార్థులు పాఠశాలల్లో సురక్షితంగా ఉంటారని భావిస్తున్న తల్లిదండ్రులు, విద్యా వేత్తల్లో ఇలాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న ఉపాధ్యాయులను డిస్మిస్ చేయాలనే డిమాండ్ కూడా పెరుగుతోంది.
![]() |
![]() |