భారత క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక ఈ టోర్నీ ఆరంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్స్ చేస్తోంది. ఏటా నిర్వహించినట్లుగానే.. ఓపెనింగ్ సెర్మనీని బీసీసీఐ గ్రాండ్గా ప్లాన్ చేస్తోంది. మ్యూజిక్ కాన్సర్ట్, డ్యాన్స్ ఈవెంట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్లో బాలీవుడ్కు చెందిన ప్రముఖ తారలు హాజరై సందడి చేయనున్నారు.
కాగా ఎప్పుడైనా కేవలం ఆరంభ మ్యాచ్‌లో మాత్రమే ఓపెనింగ్ సెర్మనీ ఉండేది. కానీ ఈసారి ఐపీఎల్‌కు ఆతిథ్యమివ్వనున్న మొత్తం 13 స్టేడియాల్లో ఆరంభ వేడుకలు నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా స్టేడియాల్లో ఐపీఎల్ 2025లో జరగనున్న తొలి మ్యాచ్లో ఈవెంట్ ఉంటుందని సమాచారం. కేవలం ఐపీఎల్ సీజన్‌లో ఓపెనింగ్ మ్యాచ్కే కాకుండా ప్రతీ స్టేడియంలో ప్రేక్షకులు ఈ అనుభూతి పొందేందుకే ఈ నిర్ణయ తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
“మార్చి 22న కోల్కతా వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్తో టోర్నీ ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్కు ఓపెనింగ్ సెర్మనీ ఉంటుంది. ఈ ఈవెంట్కు బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొని సందడి చేస్తారు. ఈసారి ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చేందుకు ప్రతీ స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్లో ఈవెంట్ నిర్వహించే ఆలోచనలో ఉన్నాం. ఈ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్న అన్ని స్టేడియాల్లో ఈ మేరకు ఈవెంట్లు ఉంటాయి. ఇందులో సాంస్కృతిక, కల్చరల్ ఈవెంట్స్ ప్రదర్శన ఉంటుంది” అని ఐపీఎస్ వర్గాలు తెలిపాయి. కాగా ఐపీఎల్ 2025 మ్యాచ్‌లు దిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, జైపూర్, అహ్మదాబాద్, చండీగఢ్, ధర్మశాల, గువాహటి, విశాఖ వేదికగా జరగనున్నాయి. మార్చి 22న తొలి మ్యాచ్.. మే 25న ఫైనల్ జరగనుంది.
![]() |
![]() |