ఐపీఎల్ 2025 మరో మూడు రోజుల్లో అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే పది జట్ల కెప్టెన్లకు కూడా ఆయా ఫ్రాంచైజీలు ప్రకటించేశాయి. ఈ సీజన్‌లో ఆడే పది జట్లలో తొమ్మిది జట్లకు ఇండియన్సే కెప్టెన్స్‌గా వ్యవహరిస్తుండగా, కేవలం సన్‌రైజర్స్‌కి మాత్రమే విదేశీ ఆటగాడు కెప్టెన్‌గా ఉన్నాడు. ఐపీఎల్ 2024 నుంచి ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్నాడు. అయితే ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్‌కు మాత్రం సూర్యకుమార్ యాదవ్ ముంబైకి కెప్టెన్సీ చేయనున్నాడు.
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తన తొలి మ్యాచ్‌ని చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆడనుంది. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కి సూర్యకుమార్ యాదవ్ సారథ్య బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ విషయాన్ని హార్దిక్ పాండ్యానే నేరుగా వెల్లడించాడు. ఐపీఎల్ 2024 ఆఖరి మ్యాచ్‌లో ముంబై స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యాపై నిషేధం పడింది. దాంతో చెన్నైతో జరిగే తొలి మ్యాచ్‌కి అతను అందుబాటులో ఉండటం లేదు.
ఐపీఎల్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కోచ్ మహేలా జయవర్దనేతో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాడు. ఈ సీజన్‌లో తమ గేమ్ ప్లాన్స్ గురించి చర్చించిన హార్దిక్.. తొలి మ్యాచ్‌కు తాను దూరమవుతున్నట్లు, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలిపాడు. దాంతో ఐపీఎల్ 2025 ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సూర్య కెప్టెన్సీలో ముందుకు వెళ్లనుంది.
తొలుత రోహిత్ శర్మకు కెప్టెన్సీ పగ్గాలు అందిస్తారని అందరూ అనుకున్నా సూర్యకి ఆ బాధ్యతలు అందాయి. ఐపీఎల్ 2023 వరకూ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. రోహిత్ కెప్టెన్సీలోనే ముంబై ఇండియన్స్ ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచింది. ఐపీఎల్ 2024కి ముందు భారీ నగదుతో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ను ముంబై తీసుకుంది. దాంతో రోహిత్‌ను అర్ధంతరంగా పక్కకు తప్పించి హార్దిక్ చేతికి పగ్గాలు ఇచ్చింది.
హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తొలి సంవత్సరంలోనే ఆ జట్టు దారుణ ఓటములను చవిచూసింది. ఐపీఎల్ 2024లో 14 మ్యాచ్‌లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు కేవలం నాలుగు మ్యాచ్‌లలోనే గెలిచి పది మ్యాచ్‌లలో ఓటమిపాలయింది. పాయింట్ల పట్టికలో కూడా అట్టడుగు స్థానానికి పడిపోయింది. ఈ సీజన్‌లో ముంబై టీమ్ స్ట్రాంగ్‌గా ఉండటంతో టైటిల్ దిశగా సాగే అవకాశం ఉంది.
![]() |
![]() |