మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చలేదని, విచారణకు రావాలని ఆయనకు నోటీసు ఇవ్వలేదని సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా సోమవారం హైకోర్టుకు తెలిపారు. అపరిపక్వ దశలో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక అధికారిగా పనిచేసిన సత్యప్రసాద్.. మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన 164 స్టేట్‌మెంట్ ఆధారంగా మిథున్‌రెడ్డిని మద్యం స్కాం కేసులో నిందితుడిగా చేర్చబోతున్నారని పత్రికల్లో కథనాలు వచ్చాయని చెబుతూ ముందస్తు బెయిల్ కోరడానికి వీల్లేదన్నారు. సత్యప్రసాద్ స్టేట్‌మెంట్‌కు సంబంధించి తమ వద్ద సమాచారం లేదని, వివరాలు తెలుసుకొని కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావు విచారణను బుధవారానికి వాయిదా వేశారు. అరెస్ట్ నుండి రక్షణ కల్పించాలన్న మిథున్‌రెడ్డి తరఫు న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారంలో గత ఏడాది సెప్టెంబరు 23న సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మిథున్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ వేశారు. సోమవారం వ్యాజ్యం విచారణకు రాగా.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు.
![]() |
![]() |