ఒలింపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్, రెజ్లర్ నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన వినేష్ ఫోగాట్‌పై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో ఆమె వద్దనుకున్న రాష్ట్ర ప్రయోజనాలను ఇప్పుడు తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తుండడంపై ఆమెను తప్పుబట్టారు. క్రీడాకారులు నిరాడంబరంగా ఉండాలని, హర్యానా క్రీడా విధానం ప్రకారం ఆమెకు లభించే ప్రయోజనాలను స్వీకరించడంలో హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు.హర్యానాకు చెందిన వినేష్ ఫోగాట్ జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, బడ్జెట్ సమావేశాల్లో ఆమె రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒలింపిక్ వెండి పతక విజేతకు సమానమైన ప్రయోజనాలను కోరారు. అసెంబ్లీలో మాట్లాడుతూ, వెండి పతకం గెలుచుకున్న వారికి లభించే గౌరవం తనకు కూడా దక్కాలని ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీని కోరారు. దీనిపై యోగేశ్వర్ దత్ స్పందిస్తూ... క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి ప్రశంసలు, మద్దతు లభించాలనడంలో సందేహం లేదని, అయితే గౌరవం, సత్కారాలు స్వీకరించేటప్పుడు కృతజ్ఞతతో ఉండాలని సూచించారు. "నాలుగు నెలల క్రితం మీరు ఏం మాట్లాడారో గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఏం అడుగుతున్నారో చూడండి" అంటూ వినేష్‌ను ఎద్దేవా చేశారు. క్రీడాకారులు తమ మూలాలను మరచిపోకూడదని, అహంకారానికి పోకూడదని హితబోధ చేశారు.హర్యానా క్రీడా విధానం ప్రకారం ఒలింపిక్స్‌లో వెండి పతకం సాధించిన వారికి రూ.4 కోట్ల నగదు బహుమతితో పాటు గ్రూప్-ఎ ఉద్యోగం, హర్యానా షహరి వికాస్ ప్రాధికరణలో ప్లాట్ కేటాయింపు లభిస్తాయి. అయితే, గతంలో వినేష్ ఈ ప్రయోజనాలను తిరస్కరించారు. ఇప్పుడు మనసు మార్చుకుని వాటిని తిరిగి కోరుతుండడంపై యోగేశ్వర్ దత్ విమర్శలు గుప్పించారు.కాగా, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో వినేష్ ఫోగట్ 50 కిలోల విభాగంలో ఫైనల్‌కు చేరినా, బరువు ఎక్కువగా ఉండటంతో అనర్హురాలయ్యారు. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు.
![]() |
![]() |