ఎంతోమంది ఇంజనీరింగ్ కలలను తీర్చే IIT JEE 2025 ఫలితాలు వచ్చేశాయి! కానీ ఈసారి కేవలం ర్యాంకుల గురించే కాదు, కొన్ని ఆసక్తికరమైన విషయాలు, కొన్ని షాకింగ్ ట్రెండ్స్ కూడా బయటపడ్డాయి. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. అసలు ఈ ఫలితాల్లో ఏమేం కొత్త విషయాలున్నాయో చూసేద్దాం! అమ్మాయిలకు షాక్ JEE మెయిన్ పరీక్షలో 31.3% మంది అమ్మాయిలు పాల్గొన్నారు. కానీ JEE అడ్వాన్స్‌డ్‌కు వచ్చేసరికి కేవలం 17.3% మాత్రమే అర్హత సాధించారు. అంటే, చివరి దశలో ఏకంగా 45% మంది బాలికలు వెనకబడ్డారు. ఇంజనీరింగ్ చదువుల్లో అమ్మాయిలు ఎందుకు ఇంకా వెనుకబడిపోతున్నారు అనే ప్రశ్న మళ్ళీ తెరపైకి వచ్చింది. రాజస్థాన్‌దే రికార్డు: 100 పర్సంటైల్‌లో వాళ్లే టాప్ JEE మెయిన్‌లో 100 పర్సంటైల్ సాధించిన మొత్తం 24 మందిలో ఏడుగురు విద్యార్థులు రాజస్థాన్ నుంచే కావడం విశేషం. అంటే, దాదాపు 30% పర్ఫెక్ట్ స్కోరర్లు ఒకే రాష్ట్రం నుంచి వచ్చారు. రాజస్థాన్‌లోని కోచింగ్ సెంటర్లు ఎంత పవర్‌ఫుల్ అనేది దీని ద్వారా తెలుస్తోంది. దివ్యాంగుల ధైర్యం: జనరల్ అభ్యర్థుల కంటే మెరుగ్గా చాలా మందిని ఆశ్చర్యపరిచిన విషయం ఇది. దివ్యాంగులైన విద్యార్థులు JEE అడ్వాన్స్‌డ్‌లో 23.7% అర్హత రేటును సాధించారు. ఇది మొత్తం అర్హత సాధించిన వారి సగటు (21.7%) కంటే ఎక్కువ. సరైన అవకాశాలు ఇస్తే ఎవరైనా విజయం సాధించగలరని వీళ్ళు నిరూపించారు. ప్రభుత్వాలు చేస్తున్న 'అందుబాటు' ప్రయత్నాలు నిజంగా పనిచేస్తున్నాయని చెప్పొచ్చు. కటాఫ్ పతనం:పేపర్ కష్టమా? ప్రిపరేషన్ తేలికపడిందా? జనరల్ కేటగిరీ కటాఫ్ మార్కులు గతేడాదితో పోలిస్తే ఏకంగా 32% పడిపోయాయి (360కి 109 నుంచి 74కి).ఇది పేపర్ చాలా కష్టంగా వచ్చిందని ఒక వాదన కాగా, విద్యార్థుల ప్రిపరేషన్ నాణ్యత తగ్గిందని మరో వాదన వినిపిస్తోంది. దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. సర్వైవల్ రేట్ 21.7% మాత్రమే: హార్వర్డ్ కంటే కష్టం! JEE మెయిన్‌లో అర్హత సాధించిన 2.5 లక్షల మందిలో కేవలం 54,378 మంది మాత్రమే JEE అడ్వాన్స్‌డ్‌ను క్లియర్ చేశారు. అంటే 21.7% మాత్రమే! ఇది అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందే రేటు కంటే కూడా కఠినమైనదని నిపుణులు అంటున్నారు. IITలలో సీటు కొట్టడం ఎంత కష్టమో ఇది స్పష్టం చేస్తోంది. కోచింగ్ లేకుండానే సత్తా చాటిన అమ్మాయి చాలా ఏళ్ల తర్వాత ఒక అమ్మాయి కోచింగ్ లేకుండానే JEE అడ్వాన్స్‌డ్ టాప్ 20 ర్యాంకుల్లో చోటు సంపాదించింది. దేవదత్త మాఝీ (AIR 16) అనే ఈ అమ్మాయి..కోచింగ్ అవసరం లేదని,సొంత కృషితో కూడా అద్భుతాలు చేయొచ్చని నిరూపించింది. తెలంగాణ కోచింగ్ మ్యాజిక్: 100 పర్సంటైలర్లలో దూసుకుపోతున్న మనోళ్లు! JEE మెయిన్‌లో 100 పర్సంటైల్ సాధించిన వారిలో 15 మంది తెలంగాణ నుంచే కావడం విశేషం. ఇది గతేడాదితో పోలిస్తే 36% పెరుగుదల. తెలంగాణ ఇప్పుడు దేశానికి కోచింగ్ క్యాపిటల్ గా మారిందని మరోసారి స్పష్టమైంది. మన రాష్ట్రంలోని కోచింగ్ సెంటర్లు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని చెప్పడానికి ఇదే ఉదాహరణ. మొత్తం మీద, IIT JEE 2025 ఫలితాలు కేవలం నెంబర్లకే పరిమితం కాకుండా, విద్యా రంగంలో మారుతున్న ట్రెండ్స్, కొత్త సవాళ్లు, అద్భుత విజయాలను కూడా చూపించాయి. భవిష్యత్తులో ఈ ఫలితాల ఆధారంగా ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa