ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఇరుదేశాలు ఒకరిపై ఒకరు వైమానిక దాడులు చేసుకుంటుండగా.. పేలుడు శబ్దాలు, సైరన్ల మోతతో అక్కడి ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. ముఖ్యంగా అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తమను వెంటనే వెనక్కి తీసుకు రావాలని భారత ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. పేలుళ్ల కారణంగా పెద్ద ఎత్తున శబ్దాలు వస్తున్నాయని.. అనుక్షణం ప్రాణ భయంతో బతుకుతున్నామని చెబుతున్నారు. వీలైనంత త్వరగా తమను స్వదేశానికి తీసుకు వెళ్లాలని కోరుతున్నారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లల్ని కాపాడమంటూ సర్కారును ఆశ్రయిస్తున్నారు.
చాలా మంది భారతీయ విద్యార్థులు ఇరాన్‌లో తక్కువ ఫీజులు ఉండటం వల్ల అక్కడికి మెడిసిన్ చదవడానికి వెళ్తుంటారు. అందులోనూ ఎక్కువగా జమ్మూ కాశ్మీర్‌కు చెందిన వాళ్లే ఉన్నారు. అయితే ప్రస్తుతం అక్కడి మెడికల్ యూనివర్సిటీల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో వారంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భారత ప్రభుత్వం తమను వెంటనే వెనక్కి తీసుకురావాలని కోరుతున్నారు. నివాస ప్రాంతాలకు దగ్గర్లోనే దాడులు జరగడంతో.. నిత్యం భయంతో వణికిపోతున్నట్లు చెబుతున్నారు.
"మా హాస్టల్‌కి 5 కిలో మీటర్ల దూరంలో పేలుడు జరిగింది. ఇక్కడ 350 మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. మేము విపరీతంగా భయపడుతున్నాము" అని షాహిద్ బెహెష్టి యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న ఇంతిసాల్ మొహిద్దీన్ అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు పేలుడు శబ్దాలతో మేము ఉలిక్కిపడి లేచామని.. వెంటనే బేస్‌మెంట్‌కు పరిగెత్తామని పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తాము నిద్ర పోలేదని వెల్లడించారు.
కెర్మాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మొదటి సంవత్సరం చదువుతున్న ఫైజాన్ అక్కడి పరిస్థితులను వివరించారు. తాము ఈరోజు తుపాకీ కాల్పుల శబ్దాలు విన్నట్లు పేర్కొన్నారు. తాగు నీటిని నిల్వ చేసుకోవాలని తమకు చెప్పినట్లు స్పష్టం చేశారు. తమ తల్లిదండ్రులు రోజుకు 10 సార్లు ఫోన్ చేస్తున్నారని.. ఇంటర్నెట్ కూడా సరిగా పనిచేయడం లేదని పేర్కొన్నారు. దీని వల్ల తమకేమవుతుందోనన్న భయంతో వాళ్లు అక్కడ, బాంబులు, కాల్పుల శబ్దాలతో తామిక్కడ నరకం చూస్తున్నట్లు వెల్లడించారు. అలాగే తామిక్కడికి ఉన్నత చదువుల కోసం మాత్రమే వచ్చామని.. కానీ ఇప్పుడు ప్రాణాలతో ఉండడమే ముఖ్యం అనిపిస్తోందని చెప్పారు.
కనీసం ఇంటికి వెళ్లిపోదామన్నా.. విమానాలు నిలిపి వేశారని ఫైజాన్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత సర్కారే తమ సమస్యను అర్థం చేసుకుని సురక్షితంగా ఇళ్లకు చేర్చాలని కోరారు. అయితే తాజాగా దీనిపై భారత రాయబార కార్యాలయం స్పందించింది. భారతీయులు అందరూ ఇళ్లలోనే ఉండాలని సూచించింది. టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా సమాచారం తెలుసుకోవాలని తెలిపింది. అలాగే అనుక్షణం తాము పరిస్థితులను గమనిస్తున్నామని.. విద్యార్థులతో టచ్‌లో ఉంటున్నామని పేర్కొంది. భారతీయ విద్యార్థుల భద్రత, శ్రేయస్సే తమకు ముఖ్యం అని చెప్పింది.
కొంత మందిని ఎంబసీ సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని కూడా వెల్లడించింది. ఇతర మార్గాలను కూడా పరిశీలిస్తున్నామని, అప్పటి వరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంయమనం పాటించాలని వివరించింది. అలాగే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని కూడా స్పష్టం చేసింది.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa