ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 04, 2025, 05:45 PM

ఆంధ్రప్రదేశ్‌ను టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టాటా మోటార్స్‌కు రూపాయికే భూమి కేటాయించిన స్ఫూర్తితో, ఏపీలోనూ అదే తరహా విధానాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. విశాఖపట్నాన్ని అంతర్జాతీయ ఐటీ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా, దిగ్గజ సంస్థలకు నామమాత్రపు లీజు ధరలకు భూములు కేటాయిస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు నారా లోకేశ్ వెల్లడించారు.రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని లోకేశ్ అన్నారు. ఇందులో భాగంగా, ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ కాగ్నిజెంట్‌కు కేవలం ఒక్క రూపాయి లీజుపై 21.31 ఎకరాల భూమిని కేటాయించామని తెలిపారు. ఈ సంస్థ విశాఖపట్నంలో రూ. 1,582.98 కోట్ల పెట్టుబడితో క్యాంపస్ ఏర్పాటు చేసి, 8,000 ఉద్యోగాలు కల్పించనుంది. అదేవిధంగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్  కేవలం 99 పైసలకే 21.16 ఎకరాలు కేటాయించగా, ఆ సంస్థ రూ. 1,370 కోట్ల పెట్టుబడితో 12,000 ఉద్యోగాలు సృష్టించనుందని వివరించారు. ప్రపంచంలోని టాప్ 100 ఐటీ కంపెనీలకు సైతం ఈ ఆఫర్ వర్తిస్తుందని, ఇది రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన గత ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రణాళికపై మంత్రి లోకేశ్ స్పష్టత ఇచ్చారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు మూడు రాజధానుల విధానానికి వ్యతిరేకమని ఆయన అన్నారు. ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతంలో వైఎస్సార్సీపీ ఒక్క సీటు కూడా గెలవకపోవడమే ఇందుకు నిదర్శనమని, ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. విశాఖను ఐటీ హబ్‌గా, గ్లోబల్ కెమికల్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు, కొత్త విమానాశ్రయం, దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.తెలంగాణతో నీటి వివాదాలపైనా లోకేశ్ మాట్లాడారు. తమ ప్రభుత్వం తెలంగాణ నుంచి ఏదీ దొంగిలించడానికి రాలేదని, రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్ష అని స్పష్టం చేశారు. నీటి వృధాను అరికట్టి, ప్రతి చుక్కను సద్వినియోగం చేసుకునేలా ప్రాజెక్టులు నిర్మించడం ముఖ్యమని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏపీకి ఎలాంటి అభ్యంతరం లేదని పునరుద్ఘాటించారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై తన వద్ద ఉన్న 'రెడ్ బుక్' గురించి లోకేశ్ ప్రస్తావించారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేశామని, దోషులు ఎవరైనా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సిందేనని హెచ్చరించారు. కాకినాడ పోర్టు వంటి ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకోవడం, భూకబ్జాలు వంటి ఉదంతాలను ఆయన ఉదహరించారు. తమ పార్టీ ఎన్నడూ వ్యక్తిగత దూషణలకు పాల్పడలేదని, కానీ జగన్ రెడ్డి మాత్రం హింసను ప్రోత్సహించారని ఆరోపించారు. అందుకే ప్రజలు 2024 ఎన్నికల్లో తమకు 94 శాతం సీట్లు ఇచ్చి, జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేశారని లోకేశ్ వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa