ఒడిశాలో భారీగా బంగారు నిల్వలు.. ఏకంగా 20 మెట్రిక్ టన్నుల పసిడి, భారత్ పంట పండినట్లే!(ఫోటోలు- Samayam Telugu)
దేశంలో బంగారం ధర తులం లక్ష రూపాయలు పలుకుతోంది. సాధారణంగా మన దేశంలో బంగారాన్ని ఆభరణాలుగా కాకుండానే ఆర్థిక వనరుగా కూడా భావిస్తారు. దీంతో పసిడికి భారత్‌లో భారీగా గిరాకీ ఉంటుంది. మన దేశంలో వెలికితీస్తున్న బంగారం.. అవసరాలకు ఏ మాత్రం సరిపోకపోవడంతో భారీగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందుకే మన దేశంలో పుత్తడికి అంత ధర పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఒడిశా రాష్ట్రంలో భారీగా గోల్డ్ నిల్వలు ఉన్నట్లు వెల్లడి కావడం.. జాక్‌పాట్ తగిలినట్లయింది. ఒడిశా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో భారీగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది. ఈ క్రమంలోనే మొదటి దశలో.. ఒక బంగారు గని బ్లాక్‌ను వేలం వేసేందుకు.. ఒడిశా సర్కార్ సిద్ధమవుతోంది.
తాజాగా బయటికి వచ్చిన ఈ కొత్త బంగారు నిల్వలు.. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు, మరీ ముఖ్యంగా స్థానిక ప్రాంతాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడనున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పసిడి నిక్షేపాలు వెలుగులోకి రావడంతో ఒడిశా ఖనిజ సంపదకు మరింత బలం చేకూర్చనుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దేవ్‌గఢ్ (అడస-రాంపల్లి), సుందర్‌గఢ్, అంగుల్, నవరంగ్‌పూర్, కెయోంఝర్, కొరాపుట్ జిల్లాల్లో.. తాజాగా బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జీఎస్ఐ శాస్త్రవేత్తలు నిర్ధారించారు. వీటితోపాటు మయూర్భంజ్, సంబల్పూర్, మల్కన్‌గిరి, బౌధ్ జిల్లాల్లోనూ విస్తృతంగా బంగారు నిల్వల కోసం పరిశోధనలు చేస్తున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన బంగారు నిక్షేపాలకు సంబంధించి.. ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి లెక్కలు విడుదల చేయనప్పటికీ.. అంచనాల ప్రకారం 10 మెట్రిక్ టన్నుల నుంచి 20 మెట్రిక్ టన్నుల మధ్య ఉండొచ్చని పేర్కొంటున్నారు. ఇది మన దేశ బంగారం అవసరాలను పూర్తిగా తీర్చలేకపోయినా.. దేశంలో బంగారు ఆభరణాల ఉత్పత్తికి గణనీయమైన ప్రోత్సాహాన్ని ఇస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా గతేడాది మన దేశం సుమారు 700 మెట్రిక్ టన్నుల నుంచి 800 మెట్రిక్ టన్నుల పుత్తడిని వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంది.
జీఎస్ఐ సైంటిస్ట్‌లు నిర్ధారించిన ఈ బంగారు నిల్వలను.. ఒడిశా ప్రభుత్వం, ఒడిశా మైనింగ్ కార్పొరేషన్ నిల్వలను వాణిజ్యపరంగా వెలికితీసేందుకు శరవేగంగా చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తొలి విడతలో భాగంగా దేవ్‌గఢ్‌లోని బంగారు గని బ్లాకును వేలం వేసేందుకు ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జీఎస్ఐ తన పరిశోధనలను ప్రాథమిక అంచనా నుంచి.. వివరణాత్మక నమూనా, డ్రిల్లింగ్‌కి పెంచింది. ఇలా చేయడం ద్వారా బంగారు నిక్షేపాల నాణ్యత, వెలికితీసే సామర్థ్యాన్ని నిర్ధారించవచ్చని పేర్కొన్నారు.
అయితే ప్రస్తుతానికి బంగారు నిల్వలు బయటికి రాగా.. అవి వాణిజ్యపరంగా ఎంత వరకు లాభదాయకం అనే చర్చ మొదలైంది. గనులను తవ్వితే అయ్యే ఖర్చుకు.. అందులో నుంచి వెలికితీసే బంగారానికి మధ్య సంబంధం ఆధారంగా వాటిని వెలికితీయాలా లేదా అనేది నిర్ణయించనున్నారు. అందుకోసం మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. ఒకవేళ అన్నీ అనుకున్నట్లే జరిగి బంగారు నిక్షేపాలను వెలికి తీస్తే.. మౌలిక సదుపాయాల కల్పన పెరగడమే కాకుండా ఉపాధి అవకాశాలు పెరిగి.. ఒడిశా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మన దేశంలోని 96 శాతం క్రోమైట్, 52 శాతం బాక్సైట్, 33 శాతం ఇనుప ఖనిజం నిల్వలు కలిగి ఉన్న ఒడిశా రాష్ట్రం.. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ బంగారు నిల్వలతో తన ఖనిజ సంపదను మరింత పెంచుకున్నట్లైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa