ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్కెట్‌లో కొత్త రకం 'సరుకు'.. కేజీ రూ. కోటి, విదేశాల నుంచి దిగుమతి

Crime |  Suryaa Desk  | Published : Tue, Aug 19, 2025, 10:43 PM

తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రత్యేకంగా పోలీసు బృందాలను ఏర్పాటు చేసి మత్తును అరికట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. సర్కార్ ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. చాప కింద నీరులా గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తూనే ఉన్నాయి. తాజాగా.. హైదరాబాద్ నగరంలోకి కొత్త రకం సరుకు వచ్చిపడుతోంది. హైడ్రోపోనిక్ గంజాయి రూపంలో మరో కొత్త ముప్పు పొంచి ఉంది. విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న ఈ కొత్త రకం గంజాయి ధరలు వింటే షాక్‌కు గురి కావాల్సిందే. బంగారం కంటే కరీదైనదిగా... ఒక్క గ్రాము ధర రూ. 10 వేలు పలుకుతుండగా.. కిలో ధర రూ. కోటికి పైగానే పలుకుతోంది.


ఈ మధ్య కాలంలో డ్రగ్స్‌కి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలు ఈ అత్యంత ఖరీదైన గంజాయిని నగరానికి చేరవేస్తున్నాయి. గత నెల రోజుల్లోనే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.53 కోట్ల విలువైన గంజాయిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తనిఖీలను దాటి వినియోగదారులకు చేరుతున్న సరుకు దీనికి రెట్టింపు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అమ్మాయిలు.. చెడు వ్యసనాలకు బానిసై చీకటి దందా


హైడ్రోపోనిక్ గంజాయి అంటే ఏంటి?


సాధారణ గంజాయిని నేలపై సాగు చేస్తుండగా.. హైడ్రోపోనిక్ గంజాయిని మట్టి లేకుండా, ప్రత్యేక ప్రయోగశాలల్లో కంట్రోల్డ్ టెంపరేటర్‌ల మధ్య పెంచుతారు. దీనికి సూక్ష్మ పోషకాలు ఉన్న ద్రవ పదార్థాలను అందిస్తారు. ఈ పద్ధతి వల్ల మొక్క వేగంగా పెరగడమే కాకుండా.. ఇందులో మత్తు శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఈ గంజాయి సాధారణ గంజాయి కంటే 30 శాతం ఎక్కువ మత్తును కలిగి ఉంటుంది. దీని ప్రభావం దాదాపు కొకైన్‌తో సమానంగా ఉంటుంది.


ఈ హైడ్రోపోనిక్ గంజాయి ఎక్కువగా థాయ్‌లాండ్ నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని దేశాల్లో దీని సాగుపై నిషేధం లేకపోవడంతో.. స్మగ్లింగ్ ముఠాలు ముఖ్యంగా మహిళలను వినియోగించి భారత్‌కు రవాణా చేయిస్తున్నాయి. గత నెల శంషాబాద్ విమానాశ్రయంలో అనుమానాస్పదంగా కనిపించిన ఒక మహిళను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా ఆమె బ్యాగులో రూ.40 కోట్ల విలువైన 40 కిలోల గంజాయి లభ్యమైంది. వారం క్రితం మరో ప్రయాణికురాలి లగేజీని తనిఖీ చేయగా.. రూ.13 కోట్ల విలువైన 13 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇది కూడా బ్యాంకాక్ నుంచే వచ్చినట్లు గుర్తించారు. ఇలా హైడ్రోపోనిక్ గంజాయి పట్టుపడటం ఆందోళన కలిగిస్తోంది. మత్తుకు బానిసలై యువత తమ జీవితాలను చిత్తు చేసుకుంటుండగా.. వాటిని అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa