క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పాకిస్థాన్‌తో క్రీడా సంబంధాలపై తమ వైఖరిని స్పష్టం చేస్తూ కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ గురువారం ఒక కొత్త విధానాన్ని ప్రకటించింది. దీని ప్రకారం, అంతర్జాతీయ టోర్నమెంట్లలో పాకిస్థాన్‌తో ఆడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. దీంతో వచ్చే నెల యూఏఈ వేదికగా జరగనున్న ఆసియా కప్‌లో దాయాదుల పోరుకు మార్గం సుగమమైంది.ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, అనంతరం భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంలో పాకిస్థాన్‌తో క్రీడా సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ విధాన ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చిచెప్పింది. "భారత జట్లు పాకిస్థాన్‌లో పర్యటించవు, అలాగే పాకిస్థాన్ జట్లను భారత్‌లో ఆడేందుకు అనుమతించం" అని మంత్రిత్వ శాఖ తన అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే, అంతర్జాతీయ క్రీడా సంస్థలు నిర్వహించే బహుళ జట్ల టోర్నమెంట్ల విషయంలో ఈ నిబంధన వర్తించదని తెలిపింది."భారత్ లేదా విదేశాల్లో జరిగే అంతర్జాతీయ టోర్నీల విషయంలో, అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల నిబంధనలకు, మన క్రీడాకారుల ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తాం. దీని ప్రకారం, పాకిస్థాన్ జట్లు లేదా క్రీడాకారులు పాల్గొనే అంతర్జాతీయ ఈవెంట్లలో భారత జట్లు, క్రీడాకారులు కూడా పాల్గొంటారు. అలాగే భారత్ ఆతిథ్యమిచ్చే ఇలాంటి టోర్నీలలో పాక్ జట్లు కూడా పాల్గొనవచ్చు" అని వివరించింది.షెడ్యూల్ ప్రకారం, టీ20 ఫార్మాట్లో జరగనున్న ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు దుబాయ్, అబుదాబి నగరాల వేదికగా జరగనుంది. గ్రూప్-ఏలో ఉన్న భారత్, సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో తలపడనుంది. అంతకుముందు సెప్టెంబర్ 10న యూఏఈతో, సెప్టెంబర్ 19న ఒమన్‌తో భారత్ తన గ్రూప్ మ్యాచ్‌లను ఆడనుంది. రాజకీయ కారణాల వల్ల బీసీసీఐ ఆతిథ్య హక్కులు కలిగి ఉన్నప్పటికీ, ఈ టోర్నమెంట్‌ను పూర్తిగా యూఏఈలో నిర్వహిస్తున్నారు. 2012-13 తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా జరగలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa