ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజింగ్ వైఖరిని స్వాగతించిన విదేశీ వ్యవహారాల నిపుణుడు సుధీంద్ర కులకర్ణి

national |  Suryaa Desk  | Published : Fri, Aug 22, 2025, 06:19 PM

భారత ఉత్పత్తులపై అమెరికా భారీగా సుంకాలు విధించడాన్ని చైనా బహిరంగంగా విమర్శించడంపై విదేశీ వ్యవహారాల నిపుణుడు, ప్రధానమంత్రి కార్యాలయం  మాజీ అధికారి సుధీంద్ర కులకర్ణి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా వంటి దేశాల దూకుడుకు వ్యతిరేకంగా భారత్, చైనా ఏకమైతే ప్రపంచ క్రమాన్ని మార్చి, సరికొత్త దిశను నిర్దేశించగలవని ఆయన అభిప్రాయపడ్డారు.భారత వస్తువులపై వాషింగ్టన్ 50 శాతం టారిఫ్‌లు విధించడాన్ని చైనా రాయబారి జు ఫెయిహాంగ్ ఖండించడం సరైన చర్య అని కులకర్ణి అన్నారు. "ఒక రౌడీలా ప్రవర్తిస్తున్నప్పుడు మౌనంగా ఉండకూడదని రాయబారి స్పష్టంగా చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ తనను తాను ప్రపంచ పోలీస్‌గా భావిస్తూ అందరినీ బెదిరిస్తున్నారు. ఆ అధికారం ఆయనకు ఎవరూ ఇవ్వలేదు" అని కులకర్ణి శుక్రవారం ఒక వార్తా సంస్థతో తెలిపారు.భారత్, చైనా పొరుగు దేశాలని, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన రెండు ప్రాచీన నాగరికతలని ఆయన గుర్తుచేశారు. "ఈ రెండు దేశాలు ఏకమైతే ప్రపంచ రూపురేఖలను మార్చేయొచ్చు. ప్రపంచ వ్యవస్థను మరింత ప్రజాస్వామ్యబద్ధంగా, సమానత్వంతో తీర్చిదిద్దవచ్చు" అని ఆయన పేర్కొన్నారు. ఈ నెలాఖరులో ప్రధాని నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ  కోసం చైనా వెళ్లనున్న నేపథ్యంలో కులకర్ణి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి."చైనాను నమ్మవచ్చా అనే ప్రశ్నకు కులకర్ణి బదులిస్తూ, నమ్మకాన్ని సంపూర్ణంగా చూడలేమన్నారు. "మనం అమెరికాను విశ్వసించాం, ప్రధాని మోదీ అమెరికా గడ్డపైనే ట్రంప్ కోసం ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు అదే ట్రంప్ మన పట్ల అత్యంత స్నేహరహితంగా ప్రవర్తిస్తున్నారు. కాలం మారుతుంది. స్నేహితులను మార్చుకోవచ్చు కానీ, పొరుగువారిని మార్చుకోలేం అని మాజీ ప్రధాని వాజ్‌పేయి చెప్పిన మాటలను గుర్తుంచుకోవాలి" అని ఆయన వ్యాఖ్యానించారు.ఇటీవల చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పర్యటనతో సరిహద్దు చర్చల్లో పురోగతి ఉందని, త్వరలోనే సానుకూల ఫలితాలు ఆశించవచ్చని కులకర్ణి తెలిపారు. పాకిస్థాన్‌తో చైనా సంబంధాల గురించి మాట్లాడుతూ, "అమెరికా కూడా పాకిస్థాన్‌కు దగ్గరగా లేదా అని ప్రశ్నించారు. భారత్, చైనా, పాకిస్థాన్ తమ మధ్య ఉన్న విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుని, ఈ ప్రాంతంలో శాంతి, శ్రేయస్సు కోసం పాటుపడాలని, 'కొత్త దక్షిణాసియా'కు ఆయన పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa