టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి నాలుగు నెలల తర్వాత భారత గడ్డపై అడుగుపెట్టాడు. లండన్‌లో ఉంటున్న కోహ్లి ఆస్ట్రేలియా పర్యటనకు ముందు దేశానికి తిరిగివచ్చాడు. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మంగళవారం చేరుకున్న కోహ్లి కి ఫ్యాన్స్ ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులో దిగిన కోహ్లి అభిమానులకు సెల్ఫీ ఇవ్వకుండానే నేరుగా కారులో ఎక్కాడు.
ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే కోహ్లీ తన భార్య అనుష్క శర్మ, ఇద్దరు పిల్లలతో కలిసి లండన్‌కి వెళ్లిపోయాడు. ఆ తర్వాత మే నెలలో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించిన విరాట్ అందర్నీ షాక్‌కు గురి చేశాడు. దాంతో దాదాపు నాలుగు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న కోహ్లీ, ఇప్పుడు మళ్లీ భారత జట్టుతో కలిసి ఆడటానికి సిద్ధమయ్యాడు.
బీసీసీఐ నిర్ణయం ప్రకారం, భారత జట్టు అక్టోబర్ 15న రెండు విడతలుగా ఆస్ట్రేలియా బయలుదేరనుంది. ఒక బ్యాచ్ ఉదయం, మరో బ్యాచ్ సాయంత్రం బయలుదేరనుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఆస్ట్రేలియాతో టీమిండియా తన మొదటి వన్డే మ్యాచ్ పెర్త్ వేదికగా అక్టోబర్ 19న ఆడనుంది.
ఈ సిరీస్ ద్వారా కోహ్లీ సుమారు నాలుగు నెలల తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కి రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. విరాట్ చివరిసారిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు. అప్పటి నుంచి టీమిండియాకు దూరంగా ఉన్న విరాట్ మళ్లీ ఇప్పుడే భారత్‌లో కనిపించడం. ఆస్ట్రేలియా సిరీస్ ఇటు విరాట్ కోహ్లితో పాటు రోహిత్ శర్మకు కూడా కీలకంగా మారనుంది. ఈ సిరీస్‌తో ఈ ఇద్దరి ఆటగాళ్ల భవితవ్యం తేలనుందని విశ్లేషకులు అంటున్నారు.
ఆస్ట్రేలియా సిరీస్ కోసం వన్డే జట్టును ప్రకటించిన సమయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు మరింత ఊపునిచ్చాయి. కోహ్లి, రోహిత్ శర్మలు 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడతారా? లేదా? అన్న ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకపోవడంతో అందరూ డైలమాలో పడ్డారు. దీంతో ఈ ఆస్ట్రేలియా పర్యటన సీనియర్ జంటకు కఠిన సవాల్ విసురుతుందనే చర్చ మొదలైంది.
అయితే, టీమిండియా నూతన వన్డే కెప్టెన్ శుభమన్ గిల్ మాత్రం ఈ వాదనకు తెరదించారు. వెస్టిండీస్‌పై టెస్ట్ సిరీస్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. “కోహ్లీ, రోహిత్ లాంటి అనుభవజ్ఞులు 2027 వరల్డ్‌కప్‌లో జట్టుకు తప్పనిసరిగా అవసరం. వారి అనుభవం, మ్యాచ్ ఫినిషింగ్ సామర్థ్యం జట్టుకు బలాన్ని ఇస్తుంది” అని అన్నాడు.
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇద్దరూ కోహ్లి, రోహిత్ భవిష్యత్తుపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం వీరిద్దరూ ఒక్క ఫార్మాట్ (వన్డే) మాత్రమే ఆడుతుండటంతో 2027 వరకూ వీరు అదే స్థాయిలో కొనసాగగలరా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. రో-కో (రోహిత్ - కోహ్లి) జంట రాబోయే విజయ్ హజారే ట్రోఫీలో కనీసం మూడు లేదా నాలుగు మ్యాచ్‌లు ఆడతారని సమాచారం.
విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 24న ప్రారంభమవుతుంది. కోహ్లి ఈ ట్రోఫీలో కనుక ఆడితే.. పదిహేనేళ్ల తర్వాత దేశవాళీ ట్రోఫీలో ఆడినట్లు అవుతుంది. రోహిత్ శర్మ చివరిసారిగా 2018లో విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు. ఈ టోర్నమెంట్ ద్వారా ఇద్దరూ తమ ఫిట్‌నెస్, ఫామ్ నిరూపించుకోవాలని సెలెక్టర్లు భావిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa