ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్ల కింద ఉన్న డార్క్ సర్కిల్స్‌ ఇలా పొగొట్టేయండి

Life style |  Suryaa Desk  | Published : Tue, Nov 25, 2025, 10:58 PM

ఈ రోజుల్లో చాలా మంది కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ సమస్యతో బాధపడుతున్నారు. ఇవి మీ అందాన్ని పాడు చేస్తాయి. కళ్ళ కింద నల్ల వలయాలు జన్యుపరమైన కారణాలు, ఒత్తిడి, నిద్ర లేకపోవడం, మొబైల్ ఫోన్లు, స్క్రీన్‌లకు అతుక్కుపోవడం, డీహైడ్రేషన్ వంటి సమస్యల వల్ల రావచ్చు.


నల్లటి వలయాల కోసం మార్కెట్లో అనేక క్రీములు, ఉత్పత్తులు అందుబాటులో ఉన్నప్పటికీ, అవి అందరికీ పని చేయవు. కొన్నిసార్లు హానికరం కావచ్చు. అయితే, ఇలాంటి వారి కోసం కొరియన్ బ్యూటీ నిపుణురాలు యెజీ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తగ్గించే సింపుల్ టెక్నిక్స్ చెప్పారు. వీటిని పాటిస్తే మీ సమస్య ఈజీగా పరిష్కారమవుతుంది. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు చుద్దాం.


డార్క్ సర్కిల్స్‌పై నిపుణులు ఏమంటున్నారు?


కొన్నిసార్లు ఈ సమస్య చర్మానికి సంబంధించినది మాత్రమే కాదు. రక్త ప్రసరణ, ద్రవ నిలుపుదలకు సంబంధించింది అని బ్యూటీ నిపుణులు అంటున్నారు. దీనివల్ల కళ్ళ కింద ఉన్న ప్రాంతం క్రమంగా నల్లబడుతుంది. ఈ నల్లదనాన్ని తొలగించడానికి, మీరు ప్రతిరోజూ ఇంట్లో 3–4 నిమిషాలు ఒక దినచర్యను అనుసరించాలని కొరియన్ నిపుణురాలు అంటున్నారు. ఈ దినచర్య నల్లటి వలయాలు, ఉబ్బరం, కళ్ళ అలసటను తగ్గించడంలో గణనీయంగా సాయపడుతుంది.


డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయి?


యేజీ ప్రకారం నల్లటి వలయాలకు ప్రధాన కారణం అలసట, నిద్ర లేకపోవడం. శరీరం అలసిపోయినప్పుడు, కళ్ళ చుట్టూ రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది. దీని వల్ల ఈ ప్రాంతం నల్లగా, వాపుగా కనిపిస్తుంది. అందువల్ల, ఈ ప్రాంతంలో రక్త ప్రసరణను పెంచడం చాలా ముఖ్యం. ఇందుకోసం మీరు ప్రతిరోజూ ఒక ప్రత్యేక టెక్నిక్ ఉపయోగించి కళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని కొద్దిసేపు మసాజ్ చేయవచ్చు. ఈ టెక్నిక్‌లో మూడు స్టెప్స్ ఉంటాయి. ఈ మూడు స్టెప్స్ డైలీ ఫాలో అయితే డార్క్ సర్కిల్స్ మాయం చేసుకోవచ్చు.


స్టెప్ -1: సుప్రాఆర్బిటల్ నాచ్ నొక్కండి


కళ్ళకు పైన.. కనుబొమ్మల క్రింద, సుప్రాఆర్బిటల్ నాచ్ అని పిలువబడే ఒక చిన్న డిప్రెషన్ ఉంది. ఈ ప్రాంతాన్ని 10 సెకన్ల పాటు సున్నితంగా నొక్కి ఉంచడం వల్ల పై కనురెప్పలకు రక్త ప్రవాహం పెరుగుతుంది. అంతేకాకుండా కళ్ళు విశ్రాంతి పొందుతాయని యేజీ వివరించారు. ఇది ఎలా చేయాలో వీడియోలో యేజీ చెప్పారు. మీరు దాన్ని ఫాలో అయితే మీకు ఓ క్లారిటీ వస్తుంది.


స్టెప్ - 2: కళ్ళ కింద మసాజ్ చేయండి


ఇప్పుడు మీ వేళ్లను లోపలి నుంచి బయటికి కంటి కింద ఉన్న ఎముక వెంట సున్నితంగా నొక్కండి. 5 సెకన్ల పాటు ఇలా చేయండి. ఇది ద్రవాన్ని తొలగించడానికి సాయపడుతుంది. అంతేకాకుండా కళ్ల కింద ఉన్న వాపు అంటే ఉబ్బిన స్థితిని తగ్గిస్తుంది. అంతేకాకుండా కంటి కింద ఉన్న ప్రాంతం తేలికగా కనిపిస్తుంది. ఈ టెక్నిక్ కూడా వీడియోలో చూపించింది యేజీ.


స్టెప్ - 3: టెంపుల్ మసాజ్


ఇందుకోసం ముందుగా మీ చేతుల్ని పిడికిలిగా బిగించండి. ఆ తర్వాత మెటికల సాయంతో నుదుటికి ఇరువైపులా సర్క్యులర్ షేపులో 10 సెకన్ల పాటు మసాజ్ చేయండి. మూడో స్టెప్‌ని కూడా వీడియోలో చూపించింది యేజీ. ఇలా చేయడం వల్ల రక్తం, శోషరస ప్రవాహం మెరుగుపడుతుంది. యేజీ ప్రకారం.. ఇలా చేయడం వల్ల కళ్లు తగిన విశ్రాంతిని పొందుతాయి. డార్క్ సర్కిల్స్ తగ్గుతాయని యేజీ చెబుతుంది.


చివరగా


చర్మ సంరక్షణ దినచర్యతో పాటు ప్రతి రాత్రి ఈ మసాజ్ టెక్నిక్స్ పాటిస్తే, కంటి ప్రాంతం క్రమంగా ప్రకాశవంతంగా, బిగుతుగా, తక్కువ అలసటతో కనిపిస్తుంది అని యేజీ అంటున్నారు. ఇది ఇంట్లో ఎవరైనా ప్రయత్నించగల సులభమైన టెక్నిక్. అంతేకాకుండా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్‌తో బాధపడేవారు ఈ 3-దశల మసాజ్ పద్ధతిని ప్రయత్నించవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa