భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో సంస్థాగత నాయకత్వంలో కీలక మార్పు చోటు చేసుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడి కోసం సోమవారం (జనవరి 19) జరిగిన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఒకటే నామినేషన్ దాఖలు కావడంతో.. నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికైన అతిపిన్న వయస్కుడిగా నిలిచారు నితిన్ నబిన్. జేపీ నడ్డా తర్వాత 45 ఏళ్ల వయసున్న నితిన్ నబిన్ బీజేపీ పగ్గాలు చేపట్టనున్నారు.
కాగా, నితిన్ ప్రస్తుతం బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. బీజేపీకి 12వ జాతీయ అధ్యక్షుడిగా జనవరి 20న నితిన్ నిబన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఎన్నిక కోసం జనవరి 18న నోటిఫికేషన్ విడుదల చేయగా.. సోమవారం నితిన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ పదవి కోసం ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో.. ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.
ఎవరీ నితిన్ నిబిన్?
బాల్యం, విద్యాబ్యాసం..
నితిన్ నబిన్ 1980 మే 23న జార్ఖండ్‌లోని రాంచీలో జన్మించారు. ఆయన తండ్రి నబిన్ కిశోర్ ప్రసాద్ సిన్హా, తల్లి మీరా సిన్హా. కిశోర్ సిన్హా సీనియర్ బీజేపీ నాయకుడు. ఆయన పాట్నా వెస్ట్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు బీహార్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. కాగా, నితిన్ నబిన్ 1996లో పాట్నాలోని సెయింట్ మైఖేల్స్ హై స్కూల్ నుంచి పదో తరగతి పరీక్షలో పాసయ్యారు. ఆ తర్వాత ఢిల్లీలోని సీఎస్‌కేఎం పబ్లిక్ స్కూల్ నుంచి 1998లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.
పెళ్లి, రాజకీయ అరంగేట్రం..
నితిన్ నబిన్.. దీప్‌మాలా శ్రీవాస్తవను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇదిలా ఉండగా.. నితిన్ నబిన్ రాజకీయ ప్రస్థానం 2006 ప్రారంభమైంది. పాట్నా వెస్ట్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో గెలిచి.. రాజకీయాల్లోకి ప్రవేశించారు నితిన్. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత.. ఆయన బాంకిపూర్కు మారారు. అప్పటి నుంచి 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తూ.. తన కంచుకోటను కాపాడుకున్నారు.
ప్రభుత్వంలో కీలక పదవులు..
నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వంలో కూడా నితిన్ నబిన్ కీలక పదవుల్లో పనిచేశారు. 2021 ఫిబ్రవరి నుంచి 2022 ఆగస్టు వరకు రహదారుల నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. 2025 ఫిబ్రవరి నుంచి 2025 డిసెంబర్ వరకు తిరిగి అదే శాఖ బాధ్యతలను చేపట్టారు. ఇక 2024 మార్చి 2025 ఫిబ్రవరి మధ్య.. ఆయన పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖతో పాటు న్యాయ మంత్రిత్వ శాఖను కూడా నిర్వహించారు. ఆయన మంత్రిగా ఉన్న కాలంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ గృహనిర్మాణ కార్యక్రమాలు, సంక్షేమ చర్యలపై దృష్టి సారించారు.
బీజేపీలో చురుగ్గా పని చేసిన నితన్ నబిన్..
బీజేపీ యువ విభాగం నుంచి వచ్చిన నబిన్.. సంస్థాగతంగా పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. గతంలో నితిన్ బీజేపీ యువ మోర్చా (బీజేవైఎం) జాతీయ ప్రధాన కార్యదర్శిగా, బీజేవైఎం బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఇదే సమయంలో జమ్మూకాశ్మీర్‌లో జరిగిన జాతీయ ఐక్యతా యాత్ర, 1965 యుద్ధంలో వీరమరణం పొందిన అమరవీరులకు నివాళులర్పిస్తూ గౌహతి నుంచి తవాంగ్ వరకు నిర్వహించిన పాదయాత్ర సహా అనేక పార్టీ ప్రచార కార్యక్రమాలలో చురుకుగా పాల్గొన్నారు.
మరోవైపు, బీజేపీ సిక్కిం ఇంచార్జిగా, ఛత్తీస్‌గఢ్ కో- ఇంచార్జిగా నితిన్ నబిన్ పనిచేశారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంలో కీలక పాత్ర పోషించారు. 2025 డిసెంబర్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు.. ఆయన్ను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa