పాకిస్థాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఇప్పటికే ఐఎమ్ఎఫ్ వద్ద పెద్ద ఎత్తున అప్పులు చేసిన దాయాది దేశానికి అవి కూడా చాలకపోవడంతో.. ఇతర దేశాల నుంచి అప్పులు తీసుకునేందుకు సిద్ధం అయింది. ముఖ్యంగా తమకు మిత్ర దేశాలు అయిన కొన్నింటి వద్ద రుణాలు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా దీనిపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ స్పందించారు. దేశ అవసరాల కోసం మిత్ర దేశాల ముందు చేతులు చాచి అప్పులు అడగడం.. తన ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ప్రముఖ వ్యాపారవేత్తలు, ఎగుమతిదారుల సదస్సులో పాల్గొన్న ఆయన.. అప్పుల కోసం దేశాధినేతలు తలవంచుకోవాల్సి రావడం ఒక దేశానికి ఎంతటి అవమానకరమో వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.
ఆత్మగౌరవంపై దెబ్బ.. తప్పని రాజీలు
ఒక దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు ఇతర దేశాల నుంచి రుణాలు సేకరించడం కేవలం ఆర్థిక ప్రక్రియ మాత్రమే కాదని.. అది దేశ ప్రతిష్టతో ముడిపడి ఉంటుందని ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభిప్రాయ పడ్డారు. మిత్ర దేశాల నుంచి అప్పులు కోరినప్పుడు వారి కోరికల భారాన్ని మోయాల్సి వస్తోందని ఆయన వాపోయారు. "మనం ఇతరుల దగ్గర డబ్బు అడిగినప్పుడు మన ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టాల్సి వస్తుంది. కొన్నిసార్లు వారు కోరే అన్యాయమైన డిమాండ్లను కూడా అమలు చేయక తప్పని పరిస్థితులు ఎదురవుతాయి. అప్పు ఇచ్చేవారి కోరికలను భరించడం ఒక పెద్ద భారంగా మారుతోంది" అని ఆయన స్పష్టం చేశారు.
పాకిస్థాన్‌కు అత్యంత కీలకమైన అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రోగ్రామ్‌ను దక్కించుకోవడానికి తాను, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ కలిసి అనేక దేశాల్లో రహస్యంగా పర్యటించినట్లు ప్రధాని వెల్లడించారు. బిలియన్ల కొద్దీ డాలర్ల రుణాలను సేకరించి, దేశ ఆర్థిక లోటును పూడ్చడం ద్వారా ఐఎంఎఫ్ ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడానికి తాము పడరాని పాట్లు పడ్డామని చెప్పారు. తలవంచుకుని అప్పులు అడగడం వెనుక ఉన్న బాధను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మిత్రదేశాలు సహాయం చేసినప్పటికీ.. ఆ సహాయం వెనుక ఉండే షరతులు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు.
పాకిస్థాన్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకోవడంలో చైనా అగ్రగామిగా నిలిచిందని ప్రధాని షెహబాజ్ షరీఫ్ కొనియాడారు. చైనాతో పాటు సౌదీ అరేబియా వంటి మిత్రదేశాలు పాకిస్థాన్‌ను ఎప్పుడూ నిరాశ పరచలేదని, వారి సహాయం వల్లే దేశం ఇప్పటికీ నిలబడి ఉందని ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇలా ప్రతిసారీ ఇతరులపై ఆధార పడటం తనకు ఎంతగానో సిగ్గు కలిగిస్తోందని గతంలోనూ ఆయన పలుమార్లు తన బాధను వెళ్లగక్కారు. 2023 జనవరిలో కూడా సౌదీ అరేబియా సాయాన్ని గుర్తు చేస్తూ.. అప్పుల కోసం చేతులు చాచడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ ఇకపై ఐఎంఎఫ్ వంటి సంస్థల రుణాలపై ఆధార పడకూడదని, స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని ప్రధాని పిలుపునిచ్చారు. అప్పుల ఊబి నుంచి బయటపడితేనే దేశానికి నిజమైన గౌరవం దక్కుతుందని ఆయన వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎగుమతులను పెంచడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించాలని, తద్వారా ఇతర దేశాల ముందు తలవంచుకోవాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవాలని కోరారు. అప్పులపై ఆధారపడే సంస్కృతికి స్వస్తి పలికితేనే పాకిస్థాన్ ఆత్మగౌరవం నిలబడుతుందని ఆయన గట్టిగా చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa