ఒక కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనం టెక్ ప్రపంచంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అమెరికాకు చెందిన ‘ఆంథ్రోపిక్’ అనే ఏఐ సంస్థ విడుదల చేసిన ఒక టూల్‌తో అటు వాల్‌స్ట్రీట్, ఇటు భారత స్టాక్ మార్కెట్లలో ఐటీ షేర్లు కుదేలయ్యాయి. ఈ పరిణామంతో ఒక్కరోజే సుమారు 300 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైపోవడం గమనార్హం. ఇప్పటికే యూనియన్ బడ్జెట్ ప్రభావంతో ఒత్తిడిలో ఉన్న భారత ఐటీ రంగానికి ఇది మరో గట్టి దెబ్బగా మారింది.ఆంథ్రోపిక్ అనేది అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా 2021లో ఏర్పాటైన ఒక ఏఐ పరిశోధన సంస్థ. ఓపెన్ఏఐ మాజీ సభ్యులు డేనియలా అమోడి, డారియో అమోడి దీనిని స్థాపించారు. ఈ సంస్థ ‘క్లాడ్’ పేరుతో శక్తివంతమైన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ను అభివృద్ధి చేసింది. సురక్షితమైన ఏఐ టెక్నాలజీని రూపొందించడమే తమ లక్ష్యమని కంపెనీ చెబుతోంది. దీని సామర్థ్యాన్ని గుర్తించిన అమెజాన్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. అమెజాన్ 4 బిలియన్ డాలర్లు, గూగుల్ 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులకు కట్టుబడి ఉన్నాయి. ప్రస్తుతం ఆంథ్రోపిక్ మార్కెట్ విలువ సుమారు 350 బిలియన్ డాలర్లుగా అంచనా.బుధవారం రోజున ఆంథ్రోపిక్ సంస్థ కార్పొరేట్ న్యాయ బృందాల కోసం కొన్ని కొత్త ఏఐ టూల్స్‌ను విడుదల చేసింది. తమ క్లాడ్ ఏఐ అసిస్టెంట్‌లో భాగంగా పనిచేసే ఈ టూల్స్కంపెనీల కాంట్రాక్టుల పరిశీలన, ఎన్డీఏల సమీక్ష, న్యాయపరమైన సారాంశాల తయారీ వంటి సాధారణ పనులను సులువుగా పూర్తి చేయగలవు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే, ఐటీ సేవల సంస్థల భవిష్యత్తుపై ఆందోళనలు మొదలయ్యాయి. ఇలాంటి సాధారణ పనుల ఆటోమేషన్ వల్ల ఐటీ కంపెనీల ఆదాయం దెబ్బతింటుందనే భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడ్డారు. ఫలితంగా వాల్‌స్ట్రీట్‌లోని నాస్డాక్ ఇండెక్స్ 1.43% పతనం కాగా, సాఫ్ట్వేర్, ఫైనాన్షియల్ డేటా స్టాక్స్‌లో సుమారు 300 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరైంది.భారత మార్కెట్‌పై తీవ్ర ప్రభావం అమెరికా మార్కెట్ల పతనం భారత ఐటీ రంగంపైనా తీవ్రంగా పడింది. ఎన్ఎస్ఈలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏకంగా 5.9% నష్టపోయింది. ఏప్రిల్ 7, 2025 తర్వాత ఒకేరోజులో ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. ఎల్‌టీఐమైండ్‌ట్రీ 7.6%, పర్సిస్టెంట్ సిస్టమ్స్ 7.5%, విప్రో 6.7%, ఇన్ఫోసిస్ 6.2%, టీసీఎస్ 6% మేర నష్టపోయాయి. గ్లోబల్ టెక్ అమ్మకాల ఒత్తిడి, బడ్జెట్ అనంతర పరిణామాలు కలిసి భారత ఐటీ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa