ఈ మధ్య చాలా మందికి అబ్బాయిలకు.. వివాహం కావడం లేదు. ముఖ్యంగా అమ్మాయిలు తక్కువగా ఉండడం.. వీరంతా ఎక్కువగా ఆస్తి, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న సంబంధాలనే చూడడంతో సామాన్య మధ్య తరగతి యువకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అచ్చంగా ఇలాంటి సమస్యనే ఎదుర్కున్న ఓ యువకుడు.. తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఓ పెద్ద నాటకమే ఆడాడు. ముఖ్యంగా ఖాకీ యూనిఫామ్ వేసుకుని పెద్ద ఎత్తున ఫొటోలు దిగాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేసి రచ్చ చేశాడు. తానో ఐపీఎస్ అధికారి అని.. నమ్మకపోతే నా సోషల్ మీడియా ఖాతా చూడమంటూ ఓ అమ్మాయిని నమ్మించాడు. అది చూసిన ఆమె అతడు నిజంగానే ఐపీఎస్ అధికారి అనుకుని పెళ్లి చేసుకుంది. కానీ తీరా వివాహం అయ్యాక.. అతడి అసలు బాగోతం బయటపడింది.
అసలేం జరిగిందంటే..?
రాజస్థాన్‌కు చెందిన అక్షత్ కొఠారి అనే వ్యక్తి సోషల్ మీడియాను తన మోసాలకు వేదికగా చేసుకున్నాడు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో తాను ఒక ఐపీఎస్ అధికారిని అని చెప్పుకుంటూ ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. నమ్మశక్యంగా ఉండేలా పోలీసు యూనిఫామ్ ధరించిన ఫోటోలను అప్‌లోడ్ చేస్తూ.. తప్పుడు సమాచారంతో అందరినీ నమ్మించాడు. ఈ క్రమంలోనే ఒక యువతికి గాలం వేసి.. తాను పెద్ద పోలీస్ ఆఫీసర్ అని నమ్మించి ఆమెను వివాహం చేసుకున్నాడు.
కానీ పెళ్లి జరిగాక అతడి తీరుపై సదరు యువతికి అనుమానం వచ్చింది. ఎప్పుడూ ఇంట్లోనే ఉండడం, యూనిఫామ్ వేసుకోకుండానే తిరగడంతో.. ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిపై నిఘా పెట్టారు. కానీ ఈ విషయం తెలుసుకున్న నిందితుడు అక్షత్ కొఠారి.. పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని పారిపోయాడు. గత రెండేళ్లుగా అతడు పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటూనే ఉన్నాడు. ఈక్రమంలోనే బన్‌స్వారా పోలీసులు.. ఇతడిపై పదివేల రూపాయల రివార్డును కూడా ప్రకటించారు.
మరోవైపు నిందితుడు తరచుగా తన లోకేషన్లను మారుస్తూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. అయితే బన్‌స్వారా సైబర్ పోలీస్ ఇన్ స్పెక్టర్ హరి ఓం నేతృత్వంలోని బృందం పక్కా నిఘా పెట్టింది. సుమారు 24 గంటల పాటు నిరంతరం పర్యవేక్షించిన తర్వాత అతడు మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఉన్నాడని తెలుసుకుని మెరుపు దాడి చేసింది. అక్కడే అతడిని అరెస్ట్ చేసింది.
అయితే ప్రాథమిక విచారణలో పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. అక్షత్ కొఠారి కేవలం ఒక యువతిని పెళ్లి చేసుకుని మోసం చేయడమే కాకుండా వివిధ జిల్లాల్లో అనేక మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఇతనిపై ఇప్పటికే రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌లోని వేర్వేరు పోలీస్ స్టేషన్లలో సుమారు 19 కేసులు నమోదు అయినట్లు తెలుసుకున్నారు. వీటిలో ఎక్కువ శాతం మోసం, ఫోర్జరీకి సంబంధించినవే కావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. నిందితుడిని కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్లు దర్యాప్తు అధికారి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa