ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజీనామా చేస్తున్న ఉదయం ప్రకటన.. గంటల్లోనే అసోం పీసీసీ చీఫ్ యూటర్న్

national |  Suryaa Desk  | Published : Mon, Feb 16, 2026, 11:14 PM

అసోం పీసీసీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బొరా తన పదవికి, కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసినట్టు సోమవారం ఉదయం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీతో తన 32 ఏళ్ల అనుబంధం నేటితో ముగిసిపోయిందని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన మీడియా ముందు చేసిన ప్రకటన అసోం రాజకీయాల్లో కలకలం రేపింది. త్వరలోనే అసోంలో ఎన్నికలు జరగనుండగా.. ఈ పరిణామం ప్రధాన ప్రతిపక్షాన్ని షాక్‌కు గురిచేసింది. అయితే, కొద్ది గంటల్లోనే ఆయన అసోం సీనియర్ నేత, ఎంపీ గౌరవ్ గొగోయ్‌తో భేటీ అయ్యారు.


అనంతరం బోరా మీడియాతో మాట్లాడుతూ.. రాజీనామాపై పునరాలోచనకు ఒక్క రోజు గడువు కోరినట్లు చెప్పారు ‘‘రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతోన్న చాలా విషయాలు అధిష్ఠానానికి తెలియవు.. దీని గురించి నేను వారికి రాశాను.. ఈ రోజు పార్టీ నాయకులు కలిసి చర్చించారు.. రాజీనామాపై ఆలోచనకు ఒక రోజు గడువు కోరాను.. నా రాజీనామా అంశమై మంగళవారం ఉదయం రాష్ట్ర వ్వవహారాల ఇంఛార్జ్ జితేంద్ర సింగ్‌ను మళ్లీ కలుస్తాను’’ అని అన్నారు.


జితేంద్ర సింగ్ మాట్లాడుతూ... ‘‘భూపేర్ బోరా చాలా సీనియర్.. కుటుంబంలో అప్పుడప్పుడు చిన్న చిన్న వివాదాలు సహజం.. కానీ, మా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది.... ఇతర పార్టీల మాదిరిగా కాదు, అక్కడ ప్రజలు నోరు మూసుకుని ఉండాలి, లేకపోతే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ వెంటనే రంగంలోకి దిగుతాయి’’ అని పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు ప్రత్యర్థులపై దర్యాప్తు సంస్థలతో బీజేపీ బెదిరింపులకు దిగుతుందని ఆయన ఆరోపించారు.


భూపెన్ బోరాతో అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడినట్టు గౌరవ్ గొగొయ్ అన్నారు. ఆయన రాజీనామాను హైకమాండ్ అంగీకరించేది లేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి బోరా గొప్ప ఆస్తి. చెడుపై పోరాటంలో ఎప్పుడూ ఆయన ముందు ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. మూడు గంటలకుపైగా బోరాతో మాట్లాడమని, కాంగ్రెస్ పార్టీకి ఆయన బలమైన నేత అని అన్నారు. ఏదైనా తప్పు జరిగితే ఓ సోదరుడిగా తాను క్షమాపణ తెలియజేస్తున్నానని చెప్పారు. రాహుల్ గాంధీ సైతం బోరాతో మాట్లాడారని గొగోయ్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa