ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీఎల్ఏ నిర్బంధంలో ఏడుగురు సైనికులు.. పాకిస్థాన్‌కు వారం రోజుల డెడ్‌లైన్

international |  Suryaa Desk  | Published : Mon, Feb 16, 2026, 11:56 PM

ఏడుగు పాకిస్థాన్ సైనికులను బందీలుగా చేసుకున్న బలూచీస్థాన్ వేర్పాటువాద గ్రూప్ బలోచ్ లిబరేషన్ ఆర్మీ ( BLA ).. ఖైదీల మార్పిడి ఒప్పందానికి రావాలని లేకుంటే వారిని చంపేస్తామని ఇస్లామాబాద్ ప్రభుత్వానికి వారం రోజులు డెడ్‌‌లైన్ విధించింది. ఈ మేరకు బీఎల్ఏ మీడియా విభాగం హక్కల్ ఓ వీడియో సందేశం విడుదల చేసింది. తాము విధించిన గడువులో ఇప్పటికే ఒక రోజు గడిచిపోయిందని, మరో ఆరు రోజులే మిగిలి ఉందని అల్టిమేటం జారీచేసింది. కాగా, దీనిపై పాక్ ఇప్పటి వరకూ అధికారికంగా ఎలాంటి స్పందన తెలియజేయలేదు.


లూచ్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసిన వీడియో ప్రకారం.., ఆపరేషన్ హెరోఫ్ రెండో దశ సమయంలో పాకిస్థాన్ ఆర్మీ జవాన్లను బందీలుగా చేసుకున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా పాకిస్థాన్ భద్రతా దళాలకు చెందిన మొత్తం 17 మంది సిబ్బందిని తమ యోధులు అదుపులోకి తీసుకున్నారని బీఎల్ఏ పేర్కొంది. వీరిలో పది మందిని బలూచ్ జాతిగా గుర్తించామని, స్థానిక పోలీసు విభాగానికి చెందినవారు కావడంతో హెచ్చరించి విడిచిపెట్టామని చెప్పింది. క్షేత్రస్థాయి పరిస్థితులు, స్థానిక గుర్తింపు, బలోచ్ ప్రజల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని వారిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. బలూచ్ నేషనల్ కోర్టు చర్యలకు లోబడి పాకిస్థాన్ సైనిక విభాగానికి చెందిన మిగతా ఏడుగురు తమ కస్టడీలో ఉన్నారని చెప్పింది.


పౌరులపై దాడులు, బలవంతపు అపహరణలకు సహకరించడం, ప్రోత్సహించడం, బలూచ్ ప్రజలపై నరమేధంలో పాల్గొనడం వంటి అభియోగాలను వీరు ఎదుర్కొన్నారని బీఎల్ఏ ర్కొంది. విచారణ సమయంలో ఆరోపణలపై నిందితులకు స్పందించడానికి అవకాశం ఇచ్చి, తగిన ఆధారాలను సమర్పించడంతో వారు తమ నేరాలను అంగీకరించినట్టు వాంగ్మూలం ఇచ్చినట్టు వివరించారు.


‘‘యుద్ధ సమయాల్లో కూడా నియమాలు, పరస్పర బాధ్యతలు ఉన్నాయని బలూచ్ లిబరేషన్ ఆర్మీ విశ్వసిస్తుంది. ఇప్పుడు నిర్ణయం పాకిస్థాన్ ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుంది.. అది ఇప్పుడు తన సైనికుల ప్రాణాలను కాపాడుకోడానికి చర్యలు తీసుకుంటుందా లేదా ఎప్పటిలాగే నిశ్శబ్దం, ఉదాసీనతను అవలంబించి తనవారి ప్రాణాలను ఫణంగా పెడుతుందా?’’ అని బీఎల్ఏ తన ప్రకటనలో తెలిపింది. ఈ విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వానికి ఏడు రోజుల గడువు విధిస్తున్నామని, అప్పటిలోగా ఖైదీల మార్పిడి ఒప్పందానికి అంగీకరించకుంటే వారికి మరణశిక్ష విధిస్తామని హెచ్చరించింది. కాగా, ఈ నెల మొదటి వారంలో బీఎల్ఏ మహిళా ఫిదాయిలు.. పాకిస్థాన్ సైన్యంపై ఆత్మాహుతి దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో పదుల సంఖ్యలో పాకిస్థాన్ సైనికులు హతమయ్యారని బీఎల్ఏ ప్రకటన విడుదల చేసింది. అయితే, పాక్ సైన్యం తామే 100 మందికిపైగా బలోచ్ వేర్పాటువాదులను హతమార్చినట్టు ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa