గతేడాది జెన్-జీ ఆందోళనలతో కేపీ శర్మ ఓలీ నాయకత్వంలోని నేపాల్ ప్రభుత్వం కూలిపోయింది. తాజాగా, ఆ దేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో జెన్-జీ మద్దతున్న రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (RSP) విజయం దిశగా సాగుతోంది. గురువారం పోలింగ్ ముగియగా.. శుక్రవారం ఉదయం నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాలను బట్టి బాలేంద్ర షా నాయకత్వంలోని ఆర్ఎస్పీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీ మొత్తం 94 స్థానాల్లో ముందంజలో ఉంది. సంప్రదాయ పార్టీలైన నేపాలీ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. కాంగ్రెస్ ఒక స్థానంలో గెలిచి, 10 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. కమ్యూనిస్ట్‌లు ఏడు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మొత్తం 165 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 67 పార్టీలు పోటీచేశాయి.
ఎన్నికల సంఘం ప్రకారం.. కౌంటింగ్ జరుగుతున్న 94 నియోజకవర్గాల్లో 70 చోట్ల ఆర్‌ఎస్పీ, నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్-యుఎంఎల్, నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీలు చెరో ఆరు నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. నేపాల్‌లో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలను భారత్ నిశితంగా గమనిస్తోంది. రాజకీయ అస్థిరత కొనసాగుతోన్న నేపాల్‌లో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడి, ఇరుపక్షాల మధ్య అభివృద్ధి భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని భారత్ భావిస్తోంది. విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. ‘పరస్పర ప్రయోజనం కోసం మా రెండు దేశాలు, ప్రజల మధ్య బలమైన బహుముఖ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి నేపాల్ కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి మేము ఎదురుచూస్తున్నాం’ అని అన్నారు. నేపాల్ స్థిరత్వం, శాంతి, అభివృద్దికి తాము కట్టుబడి ఉన్నామని, ఆ ప్రభుత్వం కోరడంతో ఎన్నికల కోసం లాజిస్టిక్ సౌకర్యం అందజేశామని చెప్పారు.
స్ట్రక్చరల్ ఇంజినీర్ అయిన బాలేంద్ర షా ర్యాపర్ సింగర్‌గా గుర్తింపు పొందారు. తన కచేరీల ద్వారా అవినీతి, అసమానతలు, యువత సమస్యలను లేవనెత్తుతారు. ఇవే యువతలో ఆయనకు క్రేజ్ తీసుకొచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉండటంతో జెన్ జీ యువత ఆయన పట్ల ఆకర్షితమైంది. కాఠ్మాండు మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఘన విజయం అందుకున్నారు. మేయర్‌గా ఆయన తీసుకున్న నిర్ణయాలు యువతను మరింత ప్రభావితం చేశాయి. తమ సమస్యలకు పరిష్కారానికి ఆయన ఆశాదీపంలో వారికి కనిపించారు. సంప్రదాయ పార్టీలు కాంగ్రెస్, కమ్యూనిస్టులకు ప్రత్యామ్నాయంగా కనిపించాడు. అదే జెన్ జీ యువతలో షా పట్ల ఆకర్షణను పెంచింది.
రాష్ట్రీయ స్వతంత్ర పార్టీని స్థాపించిన బాలేన్.. ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. ఏళ్లుగా పాతుకుపోయిన పార్టీల పునాదులను కదిలించారు. ఈ ఎన్నికల్లో దాదాపు 10 లక్షల కొత్త జెన్ జీ ఓటర్లు చేరడం ఆయన కలిసొచ్చింది. ఝపా-5 నియోజకవర్గం నుంచి పోటీచేసిన బాలెన్.. మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీపై గెలుపు దిశగా సాగుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa