ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. పరీక్షకు అరగంట లేటుగా వచ్చినా లోపలికి విద్యార్థులను అనుమతించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. దీనిపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఫీజు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామన్న ప్రైవేటు విద్యాసంస్థల తీరుపై రాష్ట్ర విద్యాశాఖ ఆగ్రహంగా ఉంది. పాఠశాలల యాజమాన్యాలతో నిమిత్తం లేకుండా నేరుగా వెబ్‌సైట్(www.bse.ap.gov.in) నుంచి హాల్ టికెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి వెల్లడించారు. హాల్ టికెట్‌లపై హెడ్ మాస్టర్ సంతకం లేకపోయినా విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతిస్తారని, అందుకు సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు నిర్వహిస్తారు. మొత్తం 6,22,537మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 3,776 పరీక్ష కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఈ సారి ఏడు ఏడు పేపర్లతో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం నిర్వహిస్తోంది.