ఉగ్రవాద బాధితులకు ఘన నివాళి.. దేశ ఐక్యతే భారత్ బలం
అమరావతి: అంతర్జాతీయ ఉగ్రవాద బాధితుల స్మృతి మరియు నివాళి దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కార్యాలయం (Deputy CMO) భావోద్వేగ సందేశాన్ని విడుదల చేసింది. ఉగ్రవాద ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు అంజలి ఘటిస్తూ, బాధిత కుటుంబాలకు మరియు ప్రాణత్యాగం చేసిన భద్రతా సిబ్బందికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని పేర్కొంది.
“మేము గుర్తుంచుకుంటాం.. ఐక్యంగా నిలబడతాం.. మరువం” అనే ప్రధాన నినాదంతో ఉగ్రవాదం వల్ల దెబ్బతిన్న కుటుంబాల వేదనను దేశమంతా పంచుకుంటుందని, వారి ధైర్యసాహసాలను గౌరవిస్తున్నామని వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఉగ్రవాదాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనే స్థాయికి చేరుకుందని తెలిపింది. దేశ సార్వభౌమాధికారం, ప్రజల భద్రత కోసం సాయుధ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPFs), నిఘా సంస్థలు నిరంతరం అప్రమత్తంగా సేవలందిస్తున్నాయని ప్రశంసించింది.
సరిహద్దుల్లో దేశ శాంతి, స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్ల త్యాగస్ఫూర్తి ప్రతి భారతీయుడికి ప్రేరణగా నిలవాలని పిలుపునిచ్చింది. ఎంతటి ఉగ్రవాదమైనా భారత్ ఐక్యతను, శాంతి పట్ల ఉన్న నిబద్ధతను దెబ్బతీయలేదని స్పష్టం చేసింది. “బాధితులను స్మరిద్దాం.. వీరులను గౌరవిద్దాం.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడదాం” అని డిప్యూటీ సీఎం కార్యాలయం ఈ సందర్భంగా పిలుపునిచ్చింది.
