తెలంగాణ విద్యార్థులకే ఎంబీబీఎస్ సీట్లు కేటాయించాలి: కల్వకుంట్ల కవిత

Select Suryaa Now

హైదరాబాద్: రాష్ట్రంలోని ఎంబీబీఎస్ సీట్లను తెలంగాణకు చెందిన స్థానిక విద్యార్థులకే ప్రాధాన్యత ఇస్తూ కేటాయించాలని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో నీట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కవితను కలిసి తమ సమస్యలను వివరించారు.

2014లో తెచ్చిన జీవో నంబర్ 150 కారణంగా స్థానికత నిబంధనలు మారి, ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఎక్కువ సంఖ్యలో సీట్లు దక్కుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల తెలంగాణ బిడ్డలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... వారం రోజుల్లో మెడికల్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో, స్థానిక విద్యార్థులకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం తక్షణమే రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

9వ తరగతి నుంచి ఇంటర్ వరకు కేవలం నాలుగేళ్లు ఇక్కడ చదివితే స్థానికత వర్తించేలా ఉన్న జీవో 150ని రద్దు చేయాలి. దీనివల్ల ప్రతి ఏటా సుమారు 1,500 నుండి 2,000 సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకే పోతున్నాయని తెలిపారు.

1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వరుసగా ఏడేళ్లు ఎక్కడ చదివితే దాన్నే స్థానికతగా పరిగణించే పాత నిబంధనను వెంటనే పునరుద్ధరించాలి.ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సున్నితమైన అంశంపై తక్షణమే స్పందించి తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

రాహుల్ గాంధీ ద్వంద్వ వైఖరిపై విమర్శలు

మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరును తప్పుబడుతూ కవిత 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ప్రశ్నించారు. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల ప్రవర్తనను తప్పుబడుతూ ఫిర్యాదు చేసిన రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పాలిత తెలంగాణలో విద్యార్థులపై జరుగుతున్న పోలీసుల దౌర్జన్యాలపై ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.

ఈ నెల 19న మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద జీవో 97కు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపిన పాలిటెక్నిక్ విద్యార్థులపై స్థానిక సీఐ అమానుషంగా ప్రవర్తించారని కవిత గుర్తుచేశారు. సొంత పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విద్యార్థులపై జరుగుతున్న దౌర్జన్యాలు రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ విద్యార్థులు, ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.