చెక్ బౌన్స్ కేసులో ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ సంచలన తీర్పు: రూ.1.2 కోట్ల జరిమానా, ఏడాది జైలు
దాదాపు పదేళ్ల నాటి భారీ ఆర్థిక వివాదానికి జనగామ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కోటి రూపాయల లావాదేవీకి సంబంధించిన చెక్ బౌన్స్ వ్యవహారంలో నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు ఏకంగా రూ.1.2 కోట్ల భారీ జరిమానా విధిస్తూ న్యాయాధికారి జి. శశి నిర్ణయం తీసుకున్నారు. బాధితుడికి జరిమానా సొమ్ము చెల్లించకపోతే అదనంగా మరో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని స్పష్టం చేశారు.
బాధితుడు గజ్జి మధు (స్టేషన్ రోడ్) వద్ద మెండె సప్తగిరి (గుండ్లగడ్డ) 2013 మార్చిలో రూ. కోటి అప్పుగా తీసుకున్నారు. రెండు నెలల్లో అసలు ఇస్తానని, అలాగే మూడేళ్ల పాటు తన వ్యాపార లాభాల్లో వాటా ఇస్తానని అప్పట్లో అంగీకరించారు. అయితే నిర్ణీత వ్యవధిలో డబ్బులు చెల్లించకపోవడంతో, 2018 డిసెంబర్‌లో ఒక్కొక్కటి రూ.40 లక్షల విలువైన రెండు చెక్కులను మధుకు ఇచ్చారు. ఆ చెక్కులను బ్యాంకులో డిపాజిట్ చేయగా, ఖాతాలో తగినంత సొమ్ము లేకపోవడంతో డిఫాల్ట్ (బౌన్స్) అయ్యాయి.
దీనిపై బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, సీసీ 45/2014 నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇరువర్గాల వాదనలు, ఆధారాలను పరిశీలించిన మేజిస్ట్రేట్ సప్తగిరిని దోషిగా నిర్ధారిస్తూ ఈ సంచలన తీర్పును వెలువరించారు.
