తన రాజకీయ జీవితం గురించి సీనియర్ నేత, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి స్పందించారు. రాయలసీమ సమస్యల పరిష్కారం కోసం తన పోరు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అలాగని తాను మళ్లీ రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బి.నారాయణ ‘రాష్ట్ర ప్రాజెక్టులు-నీటి అవసరాలు’ అనే పుస్తకాన్ని రాశారు. లోకాయుక్త జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి ఈ నెల 27న ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా నిన్న కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమాశంలో మైసూరారెడ్డి మాట్లాడారు.
పంట కాలువలు లేకపోవడంతో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నింటిపైనా నారాయణ పుస్తకం రాయడం అభినందనీయమని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమంపైనే దృష్టి సారించిందని, ఫలితంగా లెక్కకు మించి అప్పులు చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా, ప్రజల్లో మాత్రం ఎలాంటి స్పందన లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఇకపై రాయలసీమ సమస్యలు, సాగునీటి అంశాలపై పోరాటం చేయడంపై దృష్టి సారిస్తామని మైసూరారెడ్డి పేర్కొన్నారు.