వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తీరుతో ఆ పార్టీలో కలకలం రేగుతోంది. ఏదో ఒక అంశంతో సొంత పార్టీని టార్గెట్ చేస్తూ ఎంపీ రఘురామకృష్ణరాజు ముందుకెళ్తున్నారు. తాజాగా లిక్కర్ స్కామ్ లో రోహిత్ రెడ్డి, పినాక శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుడు ముగ్గురూ సూత్రధారులు, పాత్రధారులని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. భారీ పెట్టుబడితో అడాన్ డిస్టలరీని ప్రారంభించారని చెప్పారు. అన్నా క్యాంటీన్ ను కూల్చేసిన విధంగానే చంద్రబాబు ఇచ్చిన డిస్టలరీని కూడా కూల్చేయవచ్చు కదా? అని రఘురాజు ప్రశ్నించారు.
అయితే, డబ్బులు వస్తాయి కాబట్టే దాన్ని కూల్చరని అన్నారు. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పారు. అడాన్ డిస్టలరీకి రూ. 200 కోట్ల బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చారని తెలిపారు. ఢిల్లీ కుంభకోణం ఈరోజు కాకపోయినా రేపైనా బయటపడుతుందని చెప్పారు. ఏపీలో మద్యం అమ్మకాలలో డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయడం లేదని... లిక్కర్ పై వచ్చే డబ్బును ఎక్కడకు తీసుకెళ్తున్నారనే విషయంలో కేంద్రానికి లేఖ రాస్తానని రఘురామకృష్ణరాజు అన్నారు.