పార్టీకి చెందిన కీలక నేత చెన్నుపాటి గాంధీపై దాడి జరిగితే ఆయన సొంత జిల్లాకు చెందిన నేతలే స్పందించకపోవడం దారుణమని ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నేతలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలావుంటే ఏపీలో వివిధ కార్యక్రమాలతో దూకుడు పెంచుతున్న నారా చంద్రబాబునాయుడు బుధవారం ఉమ్మడి కృష్ణా జిల్లా శాఖకు చెందిన నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల విజయవాడకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెన్నుపాటి గాంధీపై దాడి జరిగిన దరిమిలా జరిగిన ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కీలక భేటీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులు గైర్హాజరయ్యారు. ఢిల్లీలో ఉన్న కారణంగా కేశినేని నాని, విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా దేవినేని ఉమ, బొండా ఉమలు ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు.
భేటీలో భాగంగా కృష్ణా జిల్లా నేతల తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి చెందిన కీలక నేత చెన్నుపాటి గాంధీపై దాడి జరిగితే ఆయన సొంత జిల్లాకు చెందిన నేతలే స్పందించకపోవడం దారుణమని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా నేతల తీరు మారాల్సి ఉందన్న చంద్రబాబు... పరిస్థితిలో మార్పు రాకపోతే సహించేది లేదని నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో నేతలంతా ఉమ్మడిగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు.