ప్రయివేటు లోన్ యాప్ వల్ల ఎదుర్కొంటున్న సమస్యల పై కళాశాలల విద్యార్థులతో స్థానిక పోలీసులు ర్యాలీ చేపట్టారు. సోమవారం ఉదయం అనకాపల్లి జిల్లా యస్ రాయవరం మండలం అడ్డురోడ్డు లో ఆంజనేయస్వామి ఆలయ కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్.రాయవరం ఎస్.ఐ ప్రసాదరావు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా ఎస్.పి వారి ఆదేశాల మేరకు ప్రజలకు లోన్ యాప్ వల్ల కలిగే నష్టాల పై అవగాహన కల్పించేందుకు విద్యార్థుల తో ర్యాలీ నిర్వహించామన్నారు.మీ ఫోన్ యాప్ లో రుణం ఇస్తామంటున్న సైబర్ నెరగాళ్లను నమ్మవద్దని పేర్కొన్నారు.
లోన్ యాప్ నుండి లోన్ తీసుకోవడం వల్ల మీ కష్టాలు తీరుతాయని మభ్యపెడుతున్నారు ఆ మాటలు నమ్మవద్దని తెలిపారు.అడగనిదే అమ్మ అయినా అన్నం పెట్టదు అన్న సామెత ఎంత నిజమో కొన్ని ఫేక్ లోన్ యాప్స్ కూడా అడగనిదే మీకు లోన్ ఇచ్చి అధోగతి పాలు చేస్తారన్నది కూడా అంతే నిజమన్నారు. మీరు లోన్ తీసుకోవడం వల్ల మీ ఫోన్ డేటాను ఓ.టి.పి ల ద్వారా వారు తీసుకొనే విధంగా మీరు అనుమతి ఇవ్వడం వల్ల మీ ఫోటోలను ,మీ కుటుంబ సభ్యుల ఫోటోలను అసభ్యకరంగా చిత్రీకరిస్తున్నారు.
ఆ ఫోటోలను ఫేస్ బుక్ వాట్సప్ స్టేటస్ లో పెడతామంటూ బెదిరింపు లకు గురిచేసి మీరు పొందిన రుణం కంటే 10 రెట్లు అదనంగా వసూలు చేస్తున్నారన్నారు.ఈ ఫోన్ యాప్ లను నమ్మవద్దని, సైబర్ నేరగాళ్లను ప్రోత్సాహించవద్దని కోరారు. అంతకుముందు ర్యాలీలో విద్యార్థుల చే ఈ ర్యాలీ, మానవహారం ద్వారా చుట్టూ గ్రామాల్లో ప్రజలు వచ్చే ముఖ్య వ్యాపార కేంద్రమైన అడ్డురోడ్డులో ప్రజలకు లోన్ యాప్ ల కలిగే నష్టాలను నేరుగా తమ సిబ్బందితో ఎస్.ఐ ప్రసాదరావు ప్రజలకు తెలియజేశారు.