ఓబుళాపురం మైనింగ్ కుంభకోణం దేశమంతటా భగ్గుమన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డిపై నమోదైన కేసుల్లో ఇంతవరకు విచారణ మొదలుపెట్టకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు నమోదై 12 ఏళ్లు నడిచినా ట్రయల్ ప్రారంభించకపోవడం ఏమిటి అని ప్రశ్నించింది. విచారణ వేగవంతం చేయాలని గతేడాది ఆగస్టులో సుప్రీంకోర్టు ఆదేశించినా ఎటువంటి పురోగతీ లేదని, దీనిని అనుమతించలేమని, సహించలేమని తేల్చిచెప్పింది.
విచారణ ఏ స్థితిలో ఉంది.. ఏయే కారణాలతో ట్రయల్ మొదలుకాలేదు అన్న అంశాలపై ఈ నెల 19వ తేదీలోగా సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించాలని హైదరాబాద్‌లోని సీబీఐ కేసుల ప్రిన్సిపల్ ప్రత్యేక జడ్జి కోర్టును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. బెయిల్ షరతులను సడలించాలంటూ గాలి జనార్దన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణమురారితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసులో ట్రయల్ మొదలైందా అని ప్రశ్నించింది. ఇంకా ప్రారంభం కాలేదని.. కేసులోని ఇతర నిందితులు కింది కోర్టులో, హైకోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేసిన కారణంగా జాప్యమైందని సీబీఐ అంటోందని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ అన్నారు.