ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జాన్సన్స్ అండ్ జాన్సన్ లైసెన్స్‌ను రద్దుచేసిన మహారాష్ట్ర ప్రభుత్వం

national |  Suryaa Desk  | Published : Sat, Sep 17, 2022, 08:28 PM

మహారాష్ట్రలో జాన్సన్స్ అండ్ జాన్సన్ పౌడర్  ఇక కనిపించదు. ఇది నిజం. ఎందుకో తెలుసా...? ప్రజారోగ్యం దృష్ట్యా బేబీ పౌడర్ ఉత్పత్తి సంస్థ జాన్సన్స్ అండ్ జాన్సన్ లైసెన్స్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. నవజాత శిశువుల చర్మానికి జాన్సన్స్ బేబీ పౌడర్ హానికలిగిస్తోందని, అందుకే ఆ సంస్థ లైసెన్స్‌ను రద్దుచేశామని మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ల్యాబొరేటరీలో బేబీ పౌడర్ నమూనాలను పరీక్షించగా ప్రమాణిక పీహెచ్ విలువ నిర్ధారణ కాలేదని ప్రకటనలో తెలిపింది. కోల్‌కతాకు చెందిన సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీ తుది నివేదిక ప్రకారం ‘‘పీహెచ్ పరీక్షకు సంబంధించి నమూనా IS 5339:2004కి అనుగుణంగా లేదు’’ అని నిర్ధారించిన తర్వాత ఈ చర్య తీసుకున్నట్టు పేర్కొంది.


పుణే, నాసిక్‌లో జాన్సన్ బేబీ పౌడర్ నమూనాలను పరీక్షల కోసం సేకరించినట్టు వివరించింది. శిశువుల కోసం తయారుచేసిన స్కిన్ పౌడర్ IS 5339:2004 స్పెసిఫికేషన్‌కు అనుగుణంగా లేదని, నమూనాల పీహెచ్ పరీక్షల్లో నాణ్యత ప్రామాణికత నిర్దారణ కాలేదని ప్రభుత్వ విశ్లేషకుడు ధ్రువీకరించారు. డ్రగ్స్ కాస్మెటిక్స్ చట్టం 1940 నిబంధనల ప్రకారం జాన్సన్ అండ్ జాన్సన్‌లకు ఎఫ్‌డీఏ షోకాజ్ నోటీసు జారీ చేసింది. అంతేకాకుండా మార్కెట్‌లో ఉన్న మొత్తం స్టాక్‌ను రీకాల్ చేయమని కంపెనీకి ఆదేశాలు జారీ చేసింది.అయితే, ప్రభుత్వ విశ్లేషకుడి నివేదికను ఆమోదించని జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ.. సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీకి నమూనాలను పంపాలని కోర్టులో సవాల్ చేసింది. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం ఇంకా వెల్లడించాల్సి ఉంది.


మరోవైపు, జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడరులో   కేన్సర్ కారకాలున్నట్టు ల్యాబ్ పరీక్షల్లో తేలడంతో మెరికాలోని వేలాది మంది వినియోగదారులు భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. కేన్సర్ కారకమైన బేబీ పౌడరు అమ్మకాలను 2023లో ప్రపంచ వ్యాప్తంగా నిలిపివేయాలని ఆ సంస్థ నిర్ణయించింది. అమెరికా, కెనడాలు 2020వ సంవత్సరంలో ఈ పౌడర్ అమ్మకాలను నిలిపివేశాయి. గత దశాబ్ద కాలంలో ఆ సంస్థ బేబీ పౌడర్ అమ్మకాలపై వేలాది వినియోగదారులు భద్రతా వ్యాజ్యాలను కోర్టుల్లో దాఖలు చేశారు.


కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్‌ను ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో విక్రయిస్తున్నారు. ఆస్బెస్టాస్ కేన్సర్ కారకంతో కలుషితం కావడం వల్ల దాని టాల్క్ ఉత్పత్తులు వ్యాధికి కారణమయ్యాయని 38 వేల వ్యాజ్యాలను కోర్టుల్లో వేశారు. దీంతో బేబీ పౌడరును ల్యాబ్‌లో పరీక్షించగా ఆస్బెస్టాస్‌ పాజిటివ్‌ అని తేలింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa