కళాకారుడికి కాదేది అనర్హం అన్నట్లే మారుతున్న నేటి కాలంలో వ్యాపారానికి కాదేది అనర్హంగా పరిస్థితి తయారైంది. వ్యాపారమంటే వ్యాపారమే.. ఏం చేశామన్నది కాదు. తప్పు చేయకుండా ఏ పని చేసి అయినా డబ్బులు సంపాదించడం ముఖ్యం. ఆర్థిక పరమైన అంశాలపై నిపుణులు ఎవరైనా చెప్పే మాట ఇదే. ఒక్కోసారి కష్టాల్లోనూ పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని డబ్బులు సంపాదించేవారు మనకు అక్కడక్కడా కనిపిస్తుంటారు. అలాంటి ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇటీవల రెడ్డిట్ వెబ్ సైట్లో ఓ వీడియో పోస్ట్ అయింది. వర్షాలతో రోడ్డుపై నీరు పారుతున్న జంక్షన్ అది. అటు వైపుగా వెళ్తున్నవారు ఆ రోడ్డు దాటాల్సిన పరిస్థితి. రోడ్డుపై కార్లు దూసుకెళుతున్నాయి. నడుచుకుంటూ వెళితే.. కాళ్లు, బూట్లు, వస్త్రాలు తడిసిపోతాయి. బురద పడి పాడవుతాయి. ఇక్కడే ఓ వ్యక్తి బిజినెస్ ఐడియా వేశాడు. చిన్నపాటి తోపుడు బండిని రోడ్డుకు ఓ వైపు పెట్టుకుని నిలబడ్డాడు. పాదచారుల దగ్గర డబ్బులు తీసుకుని ఆ తోపుడు బండిపై నిలబెట్టి.. రోడ్డుకు ఓ వైపు నుంచి మరోవైపు తీసుకెళ్లి వదిలేస్తున్నాడు. రోడ్డుపై నీటిలో నడుచుకుంటూ వెళ్లలేక చాలా మంది అతడికి డబ్బులు ఇచ్చి తోపుడు బండిలో రోడ్డు దాటుతున్నారు.
రెడ్డిట్ వెబ్ సైట్లో బి ఆల్ఫోన్జో పేరిట ఉన్న అకౌంట్లో ఈ వీడియో పోస్ట్ అయింది. ‘సమస్యలు ఉన్నప్పుడు సంపాదించే మార్గమిది’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో కాసేపటికే వైరల్ గా మారింది. ‘ముందు అవసరం ఏమిటో గుర్తించాలి. ఆ అవసరం తీర్చే పని చేయాలి.. ఇది వ్యాపారంలో మొదటి నియమం. ఈ వ్యక్తి దీన్ని పక్కాగా ఆచరించి చూపిస్తున్నాడు’ అని యూజర్ కామెంట్ చేస్తే.. మరో యూజర్ ‘వ్యాపారంలో రెండో నియమం: సమస్యను సృష్టించాలి.. దానికి పరిష్కారాన్ని అమ్మాలి (ఈ ఘటనకు వర్తించదనుకోండి)’అని సరదాగా పేర్కొన్నారు. ‘ఇతను ఎవరోగానీ మంచి వ్యాపార వేత్తలా ఉన్నాడు’ అని కొందరు.. ‘సరిగ్గా వెతుక్కుంటే డబ్బులు సంపాదించడానికి ఎన్నో మార్గాలు దొరుకుతాయి..’ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.