యూపీలోని సహరాన్‌పూర్ స్టేడియంలోని టాయిలెట్ రూమ్‌లో ఆటగాళ్లకు నాసిరకం భోజనం వడ్డించారు. రాష్ట్ర స్థాయి కబడ్డీ టోర్నీకి యూపీ నుంచి దాదాపు 300 మంది క్రీడాకారులు వచ్చారు. వారికి టాయిలెట్స్ లో భోజనం పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ప్రభుత్వం అక్కడి క్రీడా అధికారిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ వీడియో లో అంబేద్కర్ స్పోర్ట్స్ స్టేడియం లో జరిగే.. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన క్రీడాకారులకు టాయిలెట్ దగ్గరే భోజనం వడ్డించారు. మహిళా క్రీడాకారిణి టాయిలెట్ నుండి ఆహారాన్ని తీసుకువెళుతుండటం చూడవచ్చు.
వివరాల్లోకెళ్తే.. యూపీలోని సహరాన్‌పూర్‌లో అంబేద్కర్ స్పోర్ట్స్ స్టేడియంలో గత మూడు రోజుల కిత్రం అండర్ 19 కబడ్డీ టోర్నమెంట్ జరిగింది. ఈ మూడు రోజుల పాటు.. క్రీడాకారుల బస, భోజన ఏర్పాట్లు స్టేడియంలోనే జరిగాయి. స్విమ్మింగ్ పూల్ ఆవరణలో ఆహారాన్ని తయారు చేస్తున్నారు. దీనితో పాటు, ముడి సరుకులు, బియ్యాన్ని దుస్తులు మార్చుకునే గది, టాయిలెట్ దగ్గర ఉంచారు. అత్యంత నీచమైన విషయమేమిటంటే.. వండి ఆహారాన్ని.. టాయిలెట్ రూమ్ లో వండించారు. తినే ఫేట్లను టాయిలెట్ రూంలో కింద పెట్టారు. అలాగే వండిన కొన్ని ఆహారపదార్థాలపై ఎలాంటి మూతలు కూడా పెట్టలేదని, అత్యంత జిగుప్సాకరంగా ఏర్పాటు చేశారని కీడ్రాకారులు ఆరోపించారు.
స్విమ్మింగ్ పూల్ దగ్గర అన్నం వండి పెద్ద ప్లేట్‌లో తీసి టాయిలెట్ ఫ్లోర్‌లో పెట్టారని క్రీడాకారులు ఆరోపించారు. కూరగాయలు, పూరీలు కూడా తయారు చేసి మరుగుదొడ్డిలో ఉంచారని ఆరోపించారు. దుర్వాసన వెదజల్లడంతో అక్కడ నిలబడడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయంపై ఇప్పుడు విచారణ ఏర్పాటు చేయబడింది. ఈ క్రమంలో ఘటనకు భాద్యులుగా.. సహరాన్‌పూర్ ప్రాంతీయ క్రీడా అధికారి అనిమేష్ సక్సేనాను సస్పెండ్ చేశారు. జిల్లాలో జిల్లా మేజిస్ట్రేట్ అఖిలేష్ సింగ్ కూడా ఏడీఎం నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేసి ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టారు..
సహరాన్‌పూర్ స్పోర్ట్స్ ఆఫీసర్ అనిమేష్ సక్సేనా ఆరోపణలను ఖండించారు. వాటిని నిరాధారమైనవి" అని పేర్కొన్నారు. టోర్నీలో ఆటగాళ్లకు ఇక్కడ అందించే ఆహారం నాణ్యమైనదని సక్సేనా చెప్పాడు. స్టేడియంలో కొంత భాగం ఇంకా నిర్మాణంలో ఉందని చెప్పారు. దీంతో ఈ అసమానతలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం తిండికి సంబంధించి ఈ అవాంతరాలు చోటుచేసుకోవడంతో ఆటగాళ్లలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అయితే బలవంతం వల్ల అక్కడే భోజనం చేశాడు. ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియో, ఫోటో వైరల్ కావడంతో బాధ్యులు ఇప్పుడు రక్షించే పనిలో పడ్డారు.