రోడ్డు ప్రమాదాలపై నజర్ పెట్టిన కేంద్ర రోడ్డు రవాణా సంస్థ శాఖ తాజాగా పలు నిర్ణయాలు తీసుకొంది. బిజినెస్ టైకూన్ సైరస్ మిస్త్రీ కారు ప్రమాదం తర్వాత.. సీటు బెల్టుల ప్రాధాన్యత దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వం సైతం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. కారు కంపెనీలు బ్యాక్ సీటు బెల్టు అలారాన్ని తప్పనిసరి అమర్చేలా డ్రాఫ్ట్ రూల్స్‌ను కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారులను జారీ చేసింది. ఈ డ్రాఫ్ట్ రూల్స్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రజా అభిప్రాయాన్ని కోరుతోంది. వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ డ్రాఫ్ట్ రూల్స్‌పై ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుందని కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ అయిన సైరస్ మిస్త్రీ ఈ నెల ప్రారంభంలో పాల్ఘర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆయన మరణానికి ప్రధాన కారణం సీటు బెల్టు పెట్టుకోకపోవడమే. వెనుక సీట్లో కూర్చున్న సైరస్ మిస్త్రీ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో స్పాట్‌లోనే మరణించారు. ఆ ప్రమాదం తర్వాత వెనుక సీట్లలో కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా సీటు బెల్టు పెట్టుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ మేరకు నిబంధనలను సైతం ప్రభుత్వం రూపొందిస్తోంది. తాజాగా కారు కంపెనీలు వెనుక సీట్లలో కూర్చున్న వారు సీటు బెల్టు పెట్టుకోకపోతే.. అలారం మోగే సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తన డ్రాఫ్ట్ రూల్స్‌లో పేర్కొంటోంది.
2024 నాటికి రోడ్డు ప్రమాదాలను, మరణాలను 50 శాతం వరకు తగ్గించాలని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. సీటు బెల్టులతో పాటు.. అన్ని కార్లలో ఆరు ఎయిర్ బ్యాగ్‌లను కూడా ప్రభుత్వం తప్పనిసరి చేస్తుంది. ఈ డ్రాఫ్ట్ రూల్స్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఖరారు చేయనుందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుతం కారులో ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికులు సీటు బెల్టు పెట్టుకునే అలారం మోగే సిస్టమ్‌ను అన్ని వెహికిల్ తయారీ కంపెనీలు అందిస్తున్నాయి.
సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్ లోని 138(3) నిబంధన కింద వెనుక సీటులో కూర్చున్న వారు ఎవరైనా సీటు బెల్టు పెట్టుకోకపోతే.. రూ.1000 జరిమానా పడుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ విషయంలో చూసిచూడనట్టు ఉంటున్నారు. కానీ ఇక నుంచి ఈ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించనుంది. వెనుక సీటులో కూర్చున్న వారు సీటు బెల్టు పెట్టుకోకపోతే కచ్చితంగా పెనాల్టీని విధించబోతుంది. అంతేకాక ప్రస్తుతం రోడ్డు మంత్రిత్వ శాఖ రూపొందించిన డ్రాఫ్ట్ రూల్స్ అమల్లోకి వచ్చాక కారు కంపెనీలు తప్పనిసరిగా వీటికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. గతేడాది ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన రిపోర్టులో పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారత్‌లో ప్రతి నాలుగు నిమిషాలకు ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదం వల్లనే మరణిస్తున్నాడని తెలిసింది.