నేడు గౌహతి వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. తొలి టీ20లో ఘన విజయం సాధించిన టీమిండియా.. నేటి మ్యాచ్ లోనూ అదే జోరు కొనసాగించాలనే ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. ఈ టీ20 మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. నేటి మ్యాచ్‌లో అందరి దృష్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపైనే ఉంది. ఎప్పటికప్పుడు రాణిస్తున్నప్పటికీ భారీ స్కోర్లు చేయడంలో నిరంతరం విఫలమవడం టీమ్ ఇండియాను కలవరపెడుతోంది. ప్రపంచకప్‌కు ముందు రోహిత్, కోహ్లి మెరుగైన ప్రదర్శన చేయడం చాలా ముఖ్యం భావిస్తోంది.
ఏళ్ల తరబడి ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఓపెనర్ కేఎల్ రాహుల్ తొలి టీ20లో హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే అతని బ్యాటింగ్ శైలిపై విమర్శలు వచ్చాయి. వికెట్ కీపింగ్‌కు ప్రాధాన్యతనిస్తూ నెమ్మదిగా ఆడాడు. నేటి మ్యాచ్‌లో అతడు చెలరేగాలని అభిమానులు కోరుకుంటున్నారు. బ్యాటింగ్ పరంగా టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలే ప్రధాన బలం. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ ప్రతి మ్యాచ్‌లోనూ భారీ ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకుంటున్నాడు.
తొలి టీ20లో పంత్, కార్తీక్ ఇద్దరికీ అవకాశం కల్పించారు. నేటి మ్యాచ్‌లోనూ వీరిని కొనసాగించే అవకాశాలున్నాయి. తొలి టీ20లో పేసర్లు అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్ స్వింగ్ బౌలింగ్ తో ఆకట్టుకున్నారు. వీరిద్దరి అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికా తొమ్మిది పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. నేటి మ్యాచ్‌లో వారి బౌలింగ్‌ను ఎదుర్కొని సౌతాఫ్రికా రాణించడం కష్టమే. స్పిన్నర్లుగా అక్షర్ పటేల్, అశ్విన్‌లను కొనసాగించే అవకాశం ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ బాగానే ఉన్నా నిలకడ లేకపోవడం సమస్యగా మారింది. డికాక్, మార్క్రమ్, మిల్లర్ లాంటి ఆటగాళ్లు రాణిస్తేనే దక్షిణాఫ్రికా టీమ్ ఇండియాకు పోటీ ఇవ్వగలదు. నేడు గౌహతి వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం అవుతుంది.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్, అశ్విన్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, బవుమా (కెప్టెన్), రోసోవ్, ఐదెన్ మార్‌క్రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, పార్నెల్, కేశవ్ మహరాజ్, రబాడ, నోకియా, షంసి