గేదెలు ఢీకొట్టిన ప్రమాదంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు దెబ్బతింది. దానిని అధికారులు వెంటనే బాగుచేశారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే రైలుకు మరమత్తులు నిర్వహించారు. దెబ్బతిన్న రైలు ముందు భాగంలోని మెటల్ ప్లేట్‌ను ముంబై సెంట్రల్‌లోని కోచ్ కేర్ సెంటర్‌లో మార్చారు. దీనిని ఫైబర్ రీఇన్‌ఫోర్స్‌డ్ ప్లాస్టిక్(ఎఫ్‌ఆర్‌పీ)తో తయారు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోను అధికారులు ట్విటర్‌లో షేర్ చేశారు.
కాగా ముంబై నుంచి గాంధీనగర్ వెళ్తుండగా గురువారం అహ్మదాబాద్ సమీపంలో పట్టాలపై వెళ్తుండగా గేదెలను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలు కాకపోయినా రైలు ముందు భాగం ధ్వంసమైంది. ఏకంగా ఇంజిన్ ముందు భాగం ఊడిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో రైలు గంటకు 100 కి.మీ. వేగంతో ఉంది. అయితే రైలు ప్యానెల్ లేకుండానే గాంధీనగర్ స్టేషన్, తిరిగి ముంబై సెంట్రల్‌కు సకాలంలో ప్రయాణించింది.