హెచ్‌పీసీఎల్‌లో కొండకు ఆనుకొని వున్న చిమ్నీ వద్ద శుక్రవారం మధ్యాహ్నం కొంతమంది కార్మికులు గోడనిర్మాణ పనులు చేపడుతుండగా వర్షానికి బాగా నానిపోవడంతో ఆ గోడ కూలి ఇద్దరు కార్మి కులపై పడింది. దీంతో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయలయ్యాయి. వివ రాలిలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా కె. కోటపాడు మండలానికి చెందిన కె. కృష్ణ (46)తో పాటు విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆండ్ర గ్రామానికి చెందిన పైడితల్లితో పాటు మరికొంతమంది కార్మికులు హెచ్‌పీసీఎల్ వ్యర్థాలను వాయు రూపంలో విడిచిపెట్టే చిమ్నీకి సమీపంలోని కొండ వద్ద గోడ నిర్మాణం పనులు చేపట్టారు.
రోజు మాదిరిగానే శుక్రవారం కూడా పనుల్లో నిమగ్నమై వుండగా ఒక్కసారిగా పెద్ద శబ్దంతో నిర్మాణంలో వున్న గోడ కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ పనిచేస్తున కృష్ణ, పైడితల్లిపై గోడ పడడంతో మిగతా కార్మికులు అక్కడకు చేరుకుని శిథిలాలను తొలగించారు. గాయాలతో వున్న కృష్ణ, పైడితల్లిలను వెంటనే వారికి హెచ్‌పీసీఎల్ డిస్పెన్సరీలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణ మృతి చెందాడు. ఈ మేరకు మల్కాపురం సీఐ లూథర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.