ములాయం సింగ్ యాదవ్ 1967లో యూపీ శాసనసభకు మొదటి సారి ఎంపికయ్యాడు. 1977లో మంత్రి అయ్యాడు. 1980లో లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడయ్యాడు. 1989లో మొదటి సారి యూపీ సీఎం అయ్యాడు. 1990లో జనతాదళ్ లో చేరారు. 1992లో ములాయం సమాజ్ వాద్ పార్టీని స్థాపించాడు. 1993లో బీఎస్పీతో పొత్తు పెట్టుకొని మళ్లీ సీఎం అయ్యారు. అతను తిరిగి 2003 సెప్టెంబరులో మూడవసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసాడు. యాదవ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అప్పటికీ లోకసభ సభ్యుడిగా ఉన్నారు. ప్రమాణస్వీకారం చేసిన ఆరు నెలల్లోపు రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా ఉండాలనే రాజ్యాంగ నిబంధనను అధిగమించటానికి, అతను 2004 జనవరిలో గున్నౌర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేశాడు.ఆ ఎన్నికలో యాదవ్ దాదాపు 94 శాతం ఓట్లతో రికార్డు స్థాయిలో విజయం సాధించాడు. యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, కేంద్రంలో ప్రధాన పాత్ర పోషించాలనే ఆశతో, 2004 లోక్‌సభ ఎన్నికల్లో మెయిన్‌పురి నుంచి పోటీ చేసి గెలిచాడు. కానీ ఎంపీకి రాజీనామా చేసి 2007 వరకు సీఎంగా కొనసాగారు.