భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం రెండుగా చీలిపోయింది. టీమ్ A ఆస్ట్రేలియాలో పర్యటిస్తుండగా, టీమ్ B దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతోంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని సీనియర్ జట్టు T20 ప్రపంచ కప్ 2022 కోసం సిద్ధమవుతోంది. ప్రాక్టీస్ మ్యాచ్ కూడా జరిగింది. బి టీమ్‌కు డాషింగ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ నాయకత్వం వహిస్తున్నాడు. ఈరోజు దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో తలపడనుంది. క్రికెట్ ఆడే దేశాలన్నీ కూడా టీ20 ప్రపంచకప్‌కు సిద్ధమవుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మెగా టోర్నీకి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్.. టీమ్ ఏ ఆటగాళ్లంతా ఆస్ట్రేలియాలో నెట్ ప్రాక్టీస్‌లో బిజీ గా ఉన్నారు.
ఈ నెల 16వ తేదీన తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది. నెదర్లాండ్స్-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తలపడతాయి. 21వ తేదీన స్కాట్లాండ్-జింబాబ్వే మధ్య జరిగే మ్యాచ్‌తో గ్రూప్స్ దశ ముగుస్తుంది. ఆ తరువాతే అసలు పోరు ఉంటుంది. 22 తేదీ నుంచి సూపర్ 12 మొదలవుతుంది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్.. ఆతిథ్య ఆస్ట్రేలియాను ఢీ కొడుతుంది. ఆ మరుసటి రోజే భారత్.. తన చిరకాల ప్రత్యర్థిని ఎదుర్కొంటుంది. ఇదిలావుండగా- టీ20 ప్రపంచకప్ 2022పై అప్పుడే అంచనాలు మొదలయ్యాయి. ఏ జట్టు ముందడుగు వేస్తుంది? ఏ టీమ్ ఫైనల్స్‌కు చేరుకుంటుందనే అంచనాలు షురూ అయ్యాయి. ఇందులో భాగంగా యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్.. తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఈ ఈవెంట్ ఫైనలిస్టులెవరనేది తేల్చేశాడు. ప్రస్తుత ఛాంపియన్ ఆస్ట్రేలియా సహా నాలుగు జట్లను ఎంపిక చేశాడీ వెస్టిండీస్ వీరుడు. ప్రస్తుత ఛాంపియన్ ఆస్ట్రేలియా టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి అవకాశం ఉందని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా కచ్చితంగా ఫైనల్స్‌కు చేరుకుంటుందని క్రిస్ గేల్ జోస్యం చెప్పాడు. ఫైనల్స్‌లో రెండో బెర్త్ కోసం భారత్, ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని అన్నాడు. ఈ మూడు జట్లలో ఏదో ఒకటి ఆస్ట్రేలియాతో ఫైనల్స్‌లో తలపడుతుందని చెప్పాడు. తన సొంత జట్టు వెస్టిండీస్‌కు ఆ అవకాశం లేదని వ్యాఖ్యానించాడు. ఆండ్రీ రస్సెల్, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో లేకుండా వెస్టిండీస్ గెలవడం అంత సులువు కాదు అని అన్నాడు.