ఇంకొల్లు మేజర్ గ్రామపంచాయతీలో పారిశుధ్య కార్యక్రమాలు మచ్చుకైనా కనిపించడం లేదు. ఎక్కడచూసినా చెత్తకుప్పలు, పొంగిపొర్లుతున్న మురుగు కాల్వలు దర్శనం ఇస్తున్నాయి. వర్షాకాలం సీజన్లో దోమల ఉద్ధృతి కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నా పంచాయతీ అధికారులు తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గ్రామపంచాయతీ పరిధిలో గతంలో కూడా డెంగ్యూ జ్వరంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారని వారు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం కూడా గ్రామంలో డెంగీ కేసులు నమోదు అవుతున్నాయని స్థానిక వైద్యులు చెబుతున్నారు. అయినా అధికారులు అయితే మాకేంటి అన్న ధోరణి కనబరుస్తున్నారని స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నా రెండు సంవత్సరాలుగా బాగు చేయడం లేదని వారు వాపోయారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు కళ్లు తెరిచి తమను వ్యాధుల బారి నుంచి కాపాడాలని గ్రామప్రజలు చేతులెత్తి మొక్కుతున్నారు.