వికేంద్రీకరణపై న్యాయపరమైన చిక్కులు తొలగిన వెంటనే విశాఖ నుంచి పరిపాలనను ప్రారంభిస్తామని ఉమ్మడి విశాఖ జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వై. వి. సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక సర్క్యూట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. విశాఖపట్నం, కర్నూల్ తో పాటు అమరావతిని కూడా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. విశాఖ రాజధానిగా ఉండకూడదని, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదన్న ఉద్దేశంతో ఈ ప్రాంతానికి దండయాత్రగా వస్తున్న రైతులకు శాంతియుత నిరసన తెలియజేయాలని ఈ ప్రాంత వాసులకు సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని ఆ ప్రాంతాన్ని కూడా పూర్తిగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలియజేశారు. వికేంద్రీకరణకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ చేపడుతున్న కార్యక్రమాలకు తాము మద్దతు తెలియజేస్తున్నామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
జేఏసీ ముఖ్య నాయకులతో గురువారం సమావేశమవుతామని ఆయన చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలు తమను నమ్మారని, అందువలన విశాఖ గర్జన విజయవంతం అయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేశాం కాబట్టే ఈ ప్రాంత ప్రజల మద్దతును తాము కోరుకుంటున్నామని సుబ్బారెడ్డి చెప్పారు. అమరావతిపై కొంతమంది ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారో ప్రజలు ఇప్పటికే గమనించారని ఆయన అన్నారు. ఐదేళ్ళ పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అమరావతిలో శాశ్వత రాజధానిని నిర్మించలేక పోయారని, ఆర్థిక వనరులను కూడా సక్రమంగా వినియోగించుకోలేక పోయారని ఆయన అన్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో ఉపముఖ్య మంత్రి బూడి ముత్యాలనాయుడు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్, అనకాపల్లి ఎంపీ సత్యవతమ్మ, ప్రభుత్వ విప్ ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు.