రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగించాలనే ఆలోచన విరమించుకోవాలని సిపిఎం కడప నగర కార్యదర్శి ఎ. రామమోహన్ డిమాండ్ చేశారు. గురువారం కడప నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, యూనివర్సిటీల్లో దాదాపు లక్ష మంది పైగా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ ఉద్యోగాలు ఎప్పుడైనా రెగ్యులర్ అవుతాయనే ఆశతో కొనసాగుతున్నారని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల పోస్టుల్లో నియామకాలు చేపట్టినప్పుడే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కొనసాగుతున్నారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. కానీ సచివాలయ వ్యవస్థ ఏర్పడినప్పుడే అప్పటికే పని చేస్తున్న సిబ్బందిని సచివాలయంలో కలిపి అదనపు సిబ్బంది కోసం నియామకాలు చేపట్టి ఉంటే ఈ ఇబ్బంది ఉండేది కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న అస్తవ్యస్త విధానాల కారణంగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్ని బలి చేసే చర్యలు సరైన కాదన్నారు. విలేకర్ల సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు చంద్రారెడ్డి నగర కమిటీ సభ్యులు ఓబులేసు పాల్గొన్నారు.