జాబ్ ఆఫర్ అంటేనే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ అన్నిజాబ్ లు నిజమైనవి ఉండవు. ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. ఉద్యోగాల పేరుతో వల వేసి దోచుకుంటున్న ఘటనలు నమోదవుతున్నాయి. మంచి అవకాశాలను ఆశ చూపుతూ నిరుద్యోగులను మోసగిస్తున్న నకిలీ జాబ్ రాకెట్స్ ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ఇలానే మయన్మార్, లావోస్, కంబోడియా జాబ్ రాకెట్స్ నుంచి 130 మందిని కాపాడినట్టు కేంద్ర సర్కారు ఇటీవలే ప్రకటించింది. దీంతో ఉద్యోగ స్కామ్ ల్లో చిక్కుకోకుండా ఉండేందుకు కేంద్ర హోం శాఖ కీలక సూచనలు చేసింది.
ఒక్కసారి ఫోన్ లో మాట్లాడిన వెంటనే అపాయింట్ మెంట్ లెటర్ జారీ అయితే అనుమానించాల్సిందే. అపాయింట్ మెంట్ లెటర్ లో ఉద్యోగానికి సంబంధించి కచ్చితమైన వివరాలు లేకపోయినా అప్రమత్తత పాటించాలి. ఉద్యోగ వివరాలు అస్పష్టంగా ఉన్నా అనుమానించాల్సిందే. ఈ మెయిల్ కు వచ్చిన అపాయింట్ మెంట్ లెటర్ లో భాషను పరిశీలించాలి. భాష సరిగా లేకపోతే అది భూటకమే అవుతుంది. ఉద్యోగం కోసం వ్యక్తిగత వివరాలు (ఆధార్, బ్యాంకు ఖాతా, ఓటీపీ తదితర) అడుగుతున్నా అది మోసానికి సంబంధించినది అయి ఉండొచ్చు. వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు. ఇంత మొత్తం కడితే ఉద్యోగ ఆఫర్ లేదా జాబ్ లెటర్ వస్తుందని చెబితే అస్సలు నమ్మొద్దు.