జనసేన పార్టీ అధినాయకుడు పవన్‌కల్యాణ్ శనివారం నగరానికి వస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల పార్టీ నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి, మార్గదర్శనం చేయడానికి ఆయన మూడు రోజులు ఇక్కడే ఉంటారు. ఆయన శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి భారీ ర్యాలీగా నోవాటెల్‌కు వెళతారు. మూడు జిల్లాల నుంచి వచ్చే నాయకులు, కార్యకర్తలతో కలిసి జాతీయ రహదారి పైనుంచి తాటిచెట్లపాలెం, తెలుగుతల్లి ఫ్లైఓవర్, సిరిపురం జంక్షన్‌కు వెళ్లి. అక్కడి నుంచి పార్క్ హోటల్ మీదుగా నోవాటెల్‌కు వెళతారు.
హోటల్‌లో విశాఖపట్నం నాయకులతో సమావేశమవుతారు. ఆదివారం ఉదయం విశాఖపట్నం పోర్టు కళావాణి ఆడిటోరియంలో ‘జనవాణి’ నిర్వహిస్తారు. మూడు జిల్లాల్లో సమస్యలపై ప్రజల నుంచి అభ్యర్థనలు స్వీకరిస్తారు. ఇది ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. సోమవారం బీచ్‌రోడ్డులోని వైఎంసీఏలో మీడియాతో సమావేశం నిర్వహిస్తారు. ఆ తరువాత విజయనగరం, శ్రీకాకుళం నాయకులతో సమావేశమవుతారు. ఆరోజు సాయంత్రం తిరిగి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళతారు. పవన్ కల్యాణ్ మూడు రోజుల కార్యక్రమం పర్యవేక్షణకు, ఏర్పాట్లు చూడడానికి ఆయన సోదరుడు, పార్టీ నాయకులు నాగబాబు శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం వచ్చారు.