ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా గళాన్ని నొక్కేస్తామంటే ఎలా: పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 16, 2022, 10:21 PM

జనవాణి అంటేనే జనం తాలూకు గొంతు అని, అలాంటి ప్రజా గళాన్ని నొక్కేస్తామంటే ఎలా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో ఘటనలపై పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న అనంతరం జనసేనాని పవన్ కల్యాణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ గర్జన కంటే ముందే తాము విశాఖ పర్యటనపై షెడ్యూల్ ఖరారు చేశామని చెప్పారు. మూడ్నెల్ల ముందే జనవాణి కార్యక్రమంపై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మా కార్యక్రమాలు ఎప్పుడు జరుపుకోవాలో చెప్పడానికి, మా పార్టీ వ్యవహారాలపై నిర్ణయాలు తీసుకోవడానికి మీరెవరు? అంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. 


జనవాణి అంటేనే జనం తాలూకు గొంతు అని, అలాంటి ప్రజా గళాన్ని నొక్కేస్తామంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. "వైసీపీకి పార్లమెంటు ఉభయ సభల్లో 30 మంది వరకు బలముంది. రాష్ట్ర అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంతమంది ఉండి, ప్రభుత్వమే గనుక సమస్యలు పరిష్కరిస్తే ప్రజలు మా దగ్గరకు ఎందుకు వస్తారు? ప్రభుత్వంతో పోటీగా జనవాణి కార్యక్రమం చేపట్టడంలేదు. ఎన్నికలప్పుడే మేం పోటీపడతాం. నిన్న మాపై విశాఖలో పోలీసులు విపరీతమైన జులుం చేశారు. అంత సమర్ధులే అయితే వైఎస్ వివేకా కేసును ఎందుకు పరిష్కరించలేకపోయారు? ఏపీ పోలీసులపై మాకు నమ్మకం లేదు అన్న వ్యక్తి కిందే ఇవాళ ఈ పోలీసులు పనిచేస్తున్నారు. మీ శాఖకే గౌరవం ఇవ్వని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. 


రాత్రంతా నాకు మెసేజులు వస్తూనే ఉన్నాయి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తారంట... వందల కొద్దీ పోలీసులు హోటల్ వద్ద మోహరించారంట అంటూ వేకువజామున నాలుగున్నర వరకు మా వాళ్లు సందేశాలు పంపిస్తూనే ఉన్నారు. గంజాయి దొంగలను వదిలేస్తూ, వాళ్లకు మద్దతు ఇచ్చే రాజకీయ నాయకులను వదిలేస్తూ... సామాన్యుడి గొంతుక వినిపించడానికి వచ్చిన జనసేన నాయకులను మాత్రం ఇబ్బందిపెడతారు.


మా పార్టీ తాలూకు కార్యక్రమాలు చేసుకోవడానికే మేం విశాఖ వచ్చాం. అంతేతప్ప, ఈ పర్యటనలో వికేంద్రీకరణ, మూడు రాజధానులపై మాట్లాడాలన్న ఉద్దేశమే లేదు. మేం అమరావతి రాజధానికే కట్టుబడి ఉన్నాం. మీరు 2014లోనే విశాఖ రాజధాని అని ఉంటే విశాఖ రాజధానికే మద్దతు ఇచ్చేవాళ్లం. కర్నూలు రాజధాని అనుంటే కర్నూలుకే మద్దతు పలికేవాళ్లం. రాజు వచ్చినప్పుడల్లా రాజధాని మార్చుతామంటే ఎలా? నిజంగా మీకు ఉత్తరాంధ్రపై, రాయలసీమపై అంత ప్రేమ ఉందా? రాయలసీమ నుంచి ఎంతోమంది సీఎంలు వచ్చారు... మరి రాయలసీమలో ఎందుకు నీటిపారుదల ప్రాజెక్టులు కట్టడంలేదు? ఎందుకు రాయలసీమ వెనుకబాటులో ఉంది? ఉత్తరాంధ్ర విషయానికొస్తే అక్కడి రాజకీయనాయకులెవ్వరూ వెనుకబడి లేరు... ప్రజలే వెనుకబడి ఉన్నారు" అంటూ వ్యాఖ్యానించారు. 


ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వైసీపీ నేతలకు హెచ్చరికలు చేశారు. రెచ్చగొట్టేందుకు తన వద్ద చాలా ఆయుధాలు ఉన్నాయని, అయితే తాము ప్రజాస్వామ్యాన్నే నమ్ముతామని తెలిపారు. "వైసీపీ గూండాగాళ్లకు ఒకటే చెబుతున్నా. మీలాంటి క్రిమినల్స్ ను ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు. చంపేస్తాం, నరికేస్తాం, అడ్డుకుంటాం అనే పిచ్చి బెదిరింపులు, ఉడుత ఊపులు మానేయండి.


వికేంద్రీకరణ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నవారు 2014లో ఏంచేస్తున్నారు? ఈ ముఖ్యమంత్రి అప్పుడు పార్లమెంటు సభ్యుడే కదా! ఎందుకు మాట్లాడలేదు. విశాఖ ఉక్కు పరిశ్రమకు సొంత గనులు కావాలని అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? రైల్వే జోన్ గురించి ఎందుకు మాట్లాడలేదు? నాడు మేం ప్రత్యేకహోదా గురించి వస్తే ఇంతగా ఎవరూ అడ్డుకోలేదు. ఇప్పుడు జనవాణి కార్యక్రమం జరిపేందుకు వస్తే ఇంత విపరీతంగా వ్యవహరిస్తారా?


మా జనసేన నేతలు లేకుండా జనవాణి కార్యక్రమం నిర్వహించం. మా నాయకులు విడుదలై వచ్చిన తర్వాతే జనవాణి ఉంటుంది. ప్రభుత్వం భేషరతుగా మా నాయకులను విడుదల చేయాలి. లేకపోతే తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. దీర్ఘకాలిక యుద్ధం ఇది. వైసీపీ అనే కాదు, నేరచరితులు రాజకీయాల్లో ఉంటే ఇలాంటి సమస్యలే వస్తాయి. ఆంధ్రప్రదేశ్ కు ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం. 


నిన్న నాతోటి ఒక పోలీసు అధికారి అవమానకరంగా ప్రవర్తించాడు. అతడి తీరు చూస్తే కచ్చితంగా గొడవపెట్టుకునేలా ఉంది. అతడు ఎంత అవమానించినా భరించాను. ఆ పోలీసు అధికారి నేను అభివాదం చేస్తుంటే "కూర్చో" అంటాడు, బెదిరిస్తాడు. ఎంతైనా సామాన్యులం కదా భరిస్తాం. దీన్ని పోరాటం రూపంలో ముందుకు తీసుకెళతాం. 


మా వాళ్లపై 307 సెక్షన్ కింద కేసు పెట్టారు. ఇది హత్యాయత్నం సెక్షన్. మాట్లాడితే ప్రతి వైసీపీ నాయకుడు బూతులతో విరుచుకుపడిపోతున్నారు. ఏం.. మాకు మాట్లాడడం రాదనుకున్నారా? ఇలాంటి అవమానాలతో వెనుకంజ వేస్తానని అనుకోవద్దు... అన్నింటికి సిద్ధపడే వచ్చాను. క్రిమినల్స్ ను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునే క్రమంలో ప్రజాస్వామ్యం కోసం చచ్చిపోవడానికైనా సిద్ధం" అంటూ పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com