ప్రభుత్వం నుంచి ప్రజలు పొందిన లబ్దిని వివరించడంతో పాటు క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించి మెరుగైన పాలన అందించేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. జలుమూరు మండలం పాగోడు పంచాయితీ వెలుసోద గ్రామంలో 62వ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక సర్పంచ్ దామ మన్మధరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి లబ్ధిదారులతో మాట్లాడి బుక్ లెట్లు అందజేశారు. సోమవారం నిర్వహించిన గడప గడపకూ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ధర్మాన కృష్ణ దాస్ మాట్లాడుతూ పార్టీ, మతం, కులం, ప్రాంతాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం జగన్మోహన్రెడ్డి మొదలుకుని ప్రజా ప్రతినిధులమంతా పేదల సంక్షేమానికే పనిచేస్తున్నామన్నారు.
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా సచివాలయ సిబ్బంది, వలంటీర్లు అంకితభావంతో పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, ఎంపీపీ వాన గోపి, జడ్పిటిసి మెండ విజయశాంతి రాంబాబు, వైస్ ఎంపీపీ తంగి మురళీకృష్ణ, మండల పరిషత్ సలహాదారు పైడి విఠల్, కనుసు సీతారాం, స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.