ప్రతి సంవత్సరం లక్ష టన్నుల జయ బొండాలు రకం ధాన్యం, మరో 60 వేల టన్నుల బియ్యం సరఫరా చేయాలని కేరళ పౌరసరఫరాల శాఖ మంత్రి జి.ఆర్ అనిల్ కోరారని.. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. వాటితోపాటు కందులు, మినుములు, పెసలు, గుంటూరు మిర్చి కూడా కావాలని అడిగారని చెప్పారు. వీటికి సరైన గిట్టుబాటు ధర లభించి రాష్ట్రంలోని రైతులకు మేలు జరుగుతుందంటే జయ బొండాలు రకం ధాన్యం పండించి కేరళకు సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. కేరళ మంత్రి అనిల్, ఉన్నతాధికారులతో కూడిన ప్రతినిధి బృందం సోమవారం విజయవాడకు వచ్చి మంత్రి కారుమూరితో చర్చలు జరిపారు. ఈ నెల 27న కేరళలో సమావేశం జరగనుంది. కాగా నెల్లూరులో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రూ.30 కోట్ల మేర నిధులను సొంత ఖాతాలకు మళ్లించిన ఉదంతంపై సీఐడీ విచారణ జరిపించాలని కోరుతానన్నారు.