ప్రజల్లో మార్పు వచ్చి సమాజంపై బాధ్యతగా వ్యవహరిస్తూ అవకాశవాదం వీడినప్పుడే సమస్యలు పరిష్కారమౌతాయని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి వైవీఎస్‌బీజీ పార్థసారధి అన్నారు. శనివారం స్థానిక విద్యానగర్ శివారులోని సుగాలి కాలనీలో న్యూమాడ్యూల్ లీగల్ సర్వీసు క్యాంపు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ ప్రజలందరూ చట్టాలపై అవగాహన కలిగివుండాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని పిల్లలకు ఉన్నత చదువులు చెప్పించాలన్నారు. జిల్లాలో దాదాపు 88 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు చెప్పారు. ఆస్తి వివాదాలు, భార్యభర్తల మధ్యన గొడవలు తదితర రాజీ పడదగ్గ కేసులు వీటిల్లో 40 వేల వరకు ఉన్నాయని తెలిపారు. డీఎల్‌ఎస్‌ఏ కల్పిస్తున్న ప్రీసెటిల్‌మెంట్‌ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నవంబరు 12న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి మాట్లాడుతూ సుగాలి కాలనీని వాసులకు ఇళ్లు కేటాయించారని తెలిపారు.