కార్తీకమాసంలో సముద్రతీరానికి పుణ్యస్నానాల నిమిత్తం విచ్చేసే భక్తులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ పనిచేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి కోరారు. బాపట్ల మున్సిపల్ కౌన్సిల్ హాల్లో శనివారం ఆయా శాఖల అధికారులతో ఏర్పాటుచేసిన సమన్వయ సమావేశంలో కార్తీకపౌర్ణమికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ సూర్యలంక సముద్ర తీరానికి 2 లక్షల మంది వచ్చినప్పటికీ పార్కింగ్ సమస్య తలెత్తకుండా అటవీ భూములను వినియోగించుకోవాలన్నారు. భక్తులు స్నానాలాచరించే సందర్భంలో ఏవిధమైన ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గజ ఈతగాళ్ళను ఏర్పాటుచేసి స్పీడ్ బోట్లతో గస్తీ నిర్వహించాలన్నారు. లైటింగ్ సౌకర్యం కల్పించాలని, దీనికి టూరిజం సహకారం తీసుకోవాలని పంచాయతీ అధికారులకు కోన రఘుపతి సూచించారు.