రాయచోటి నియోజకవర్గంలో సంబేపల్లె, చిన్నమండెం ప్రాంతంలో అధికశాతం రైతులు టమోటా సాగు చేస్తున్నారు. ఈ రెండు మండలాల్లో సుమారు రెండు వేల ఎకరాల్లో టమోటా సాగులో ఉంది. ఒక ఎకరా తీగ టమోటా సాగుకు రూ.లక్ష నుంచి రూ.లక్షా 20 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది రైతులు తెగుళ్ల భారిన పడి నష్టపోయారు. ప్రస్తుతం మార్కెట్‌లో టమోటా ధరలు నిలకడగా లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సాధారణంగా ఒక ఎకరాకు 18 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తుందని, కానీ తెగుళ్లదెబ్బకు దిగుబడిపై ప్రభావం పడే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలియజేశారు. లక్షలు ఖర్చు చేసి తెగుళ్ల దెబ్బకు కుదేలు కావడం బాధాకరమని అంటున్నారు. టమోటా రైతులకు తీవ్రంగా నష్టం చేసే వాటిల్లో ఉజీ ఈగ ఒకటి. దీంతో దిగుబడి వచ్చినా మార్కెట్‌లో తక్కువ ధరకు వీటిని కొనుగోలు చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా టమోటా రైతు నష్టపోక తప్పదు. దిగుబడి ఉన్నా ధర లేక నష్టపోవడం పరిపాటిగా మారింది. ఇలాంటి రైతుల కోసం ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి రైతులను ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.